దట్టమైన అడవిలో 100 ఏళ్లనాటి బంగ్లా.. ఒక రాత్రికి రూ.లక్ష

23 Jul, 2021 20:28 IST|Sakshi
హ‌లాలా కండా

100 Year Old Mansion
కోలంబో: అది ఒక‌ప్పుడు అద్బతమైన బంగ్లా..1912 కాలంలో ఓ సంపన్నుడు తన భార్య గుర్తుగా ఆ భవనాన్ని నిర్మించాడు. శ్రీలంక‌లోని వెలిగామ ప‌ట్టణానికి స‌మీపంలో ఈ అద్బతమైన భవంతికి హ‌లాలా కండా అనే పేరు పెట్టుకున్నాడు. అప్పట్లో ఈ బంగ్లాకు ఎంతో మంది ప్రముఖులకు విడిదిగా ఉండేది. ఇథియోపియన్ చక్రవర్తి హేలీ సెల‌స్సీ, అలనాటి ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ కేథ్ మిల్లర్ వంటి ప్రముఖులు విడిది చేసేవారు. కానీ రోజులు గడేచే కొద్ది ఆ బంగ్లా వైభ‌వం త‌గ్గిపోయింది. చివరకు అడవిలో శిధిలమైన బంగ్లాలా మిగిలిపోయింది. ఈ భవంతిలో రాతి గోడలు కూలిపోయి.. గ‌బ్బిలాల‌కు ఆ బంగ్లా ఆవాసంగా మారిపోయింది.

ఈ క్రమంలో ఎందుకు పనికి రాని ఈ భ‌వ‌నాన్ని 2011లో రూ.2కోట్లుకు నలుగురు స్నేహితులు కొనుగోలు చేశారు. తర్వాత ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ అయిన‌ శార్ప్, అత‌ని స్నేహితులు జెన్నీ లెవిస్‌, రిచ‌ర్డ్ బ్లీస్‌డేల్‌, బెంట్లీ డి బేయ‌ర్‌ ఆ బంగ్లాను పునర్నిర్మాణం చేసి బంగ్లాకు పున‌ర్వైభ‌వం తీసుకొచ్చారు .ఈ క్రమంలో వాళ్లు ఎన్నో స‌వాళ్లను ఎదుర్కొన్నారు. 2012 డిసెంబ‌ర్‌లో ఆ బంగ్లా పున‌ర్నిర్మాణ ప‌నుల‌ను మొద‌లు పెట్టారు. బంగ్లాకు పున‌ర్వైభ‌వం తీసుకురావ‌డానికి దాదాపు రెండేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. చారిత్రాత్మక‌త దెబ్బతిన‌కుండా ఇప్పటి అధునాత‌న సౌక‌ర్యాలు ఉండేలా ఆ భవనాన్ని పూర్తి చేశారు.

అంతేకాకుండా గార్డెన్‌లో 23 మీట‌ర్ల పొడ‌వుతో ఒక నీటి కొల‌నును ఏర్పాటు చేశారు.  ఇప్పుడు దాన్ని ఆ న‌లుగురు స్నేహితులు రిసార్ట్‌గా మార్చేశారు. ఐదు బెడ్రూంల‌తో అందంగా ఉన్న ఈ భవంతిలో 12 మంది బ‌స చేయ‌వ‌చ్చు. ఈ రిసార్ట్‌కు ఒక మేనేజ‌ర్‌, చెఫ్‌, ఇద్ద‌రు స‌ర్వీస్‌ స్టాఫ్‌, ఇద్ద‌రు గార్డెన‌ర్లు, ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నారు. ఈ రిసార్ట్‌లో ఒక రాత్రి గ‌డ‌పాలంటే దాదాపు రూ. ల‌క్ష (1300 డాల‌ర్లు) చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎప్పడైనా  శ్రీలంకను సందర్శిస్తే,  ఈ భవనం తప్పనిసారిగా చూడాల్సిందే.

మరిన్ని వార్తలు