కాసుల వర్షం కురిపించిన డైనోసర్‌ అస్థిపంజరం.. ఏకంగా రూ. 96 కోట్లు..

14 May, 2022 12:50 IST|Sakshi

11 కోట్ల ఏళ్ల నాటి ఓ డైనోసార్‌ అస్థిపంజరం ఇటీవల ఓ వేలంలో దాదాపు రూ. 96 కోట్లు పలికిందంటే నమ్ముతారా! వేలం వేసిన వాళ్లే ఎక్కువలో ఎక్కువగా రూ. 50 కోట్ల వరకు వస్తాయనుకుంటే.. వాళ్ల అంచనాలను తలకిందులు చేసిందీ ఈ అస్థిపంజరం. కాసుల వర్షం కురిపించింది. ఇంతకీ అంత ప్రత్యేకత ఏముంది ఇందులో అనుకుంటున్నారా? ఇప్పటివరకు దొరికిన డైనోసార్‌ అస్థిపంజరాల్లో అతి పెద్దది, పూర్తి ఆకారంలో లభించింది ఇదే మరి. అంతేకాదు.. టీరెక్స్‌ తరహాలో ఇది బాగా ఫేమస్‌.. పేరు డైనానుకస్‌ యాంటిరోపస్‌. జురాసిక్‌ పార్క్‌ చిత్రంలో కిచెన్‌లో పిల్లలను వెంటాడే రాక్షస బల్లి ఇదే.
చదవండి: బట్టతల ఉన్నవారికి ఊరటనిచ్చే వార్త.. ఇక ఎగతాళి చేశారో అంతే!

2012 నుంచి 2014 మధ్య అమెరికాలోని మోంటానాలో ఉన్న వూల్ఫ్‌ లోయలో పురావస్తు శాస్త్రవేత్తలు రాక్, రాబర్ట్‌ ఓవన్‌ జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడింది. దీని ఎత్తు 4 అడుగులు, పొడవు 10 అడుగులు. ఆ సమయంలో అస్థిపంజరంలో 126 ఎముకలున్నాయి. ఆ తర్వాత పురాతత్వ శాస్త్రవేత్తలు దీనికి తుది రూపును తీసుకొచ్చారు. ఇందులో పుర్రె భాగంలో చాలా వరకు, ఎముకల్లో కొన్నింటిని మళ్లీ కొత్తగా రూపొందించారు. ప్రపంచంలో ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద ఉన్న ఒకే ఒక డైనోసార్‌ అస్థిపంజరం ఇదే. అయితే ఇంత ధర పెట్టి ఈ అస్థిపంజరాన్ని ఎవరు కొన్నారో మాత్రం చెప్పలేదు. 
 – సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌  

మరిన్ని వార్తలు