పజిల్స్‌తో ఆడుకునే వయసులో నవలలు.. గిన్నిస్ రికార్డు సృష్టించిన అమ్మాయి

13 Jul, 2022 09:05 IST|Sakshi

సౌదీ అరేబియా: పన్నెండేళ్లు.. వర్డ్‌ పజిల్స్‌తో ఆడుకునే వయసు. కానీ... వరుసగా మూడు నవలలను రాసిందో అమ్మాయి. తద్వారా నవలల సిరీస్‌ను రాసిన అతి పిన్న వయసు అమ్మాయిగా గిన్నిస్‌  రికార్డు సృష్టించింది. పైగా.. ఇప్పుడు నాలుగో నవలను పూర్తి చేసే పనిలో ఉంది. సౌదీ అరేబియాకు చెందిన రితాజ్‌ హుస్సేన్‌ అల్‌హజ్మీ పుస్తకాలంటే చాలా ఇష్టం. అయితే తన వయసు పిల్లలకోసం సరైన నవలలు లేవనిపించిందామెకు. తానే ఎందుకు రాయకూడదు అని ఆలోచించింది.

ఆరేళ్ల వయసులోనే చిన్నచిన్నగా రాయడం మొదలుపెట్టి, పన్నెండేళ్లు వచ్చేనాటికి  నవలలే రాసేసింది. మొదటి మూడు పుస్తకాలు పబ్లిష్‌ అయ్యేనాటికి అల్‌హజ్మీ వయసు 12 ఏండ్ల 295 రోజులు. మొదటి నవల ‘ట్రెజర్‌ ఆఫ్‌ ది లాస్ట్‌ సీ’ 2019లో పూర్తి చేసింది. దానికి సీక్వెల్‌గా ‘పోర్టల్‌ ఆఫ్‌ ది హిడెన్‌ వరల్డ్‌’ను, తరువాత మూడో పుస్తకంగా ‘బియాండ్‌ ద ఫ్యూచర్‌ వరల్డ్‌’ తీసుకొచ్చింది. ఇప్పుడు అల్‌హజ్మీకి 13 ఏళ్లు. నాలుగో పుస్తకం ‘పాసేజ్‌ టు అన్‌నోన్‌’ రాస్తోంది.

మరిన్ని వార్తలు