సొంత భాష మాట్లాడటమే ఆ విద్యార్థి నేరమా? క్లాస్‌లోనే నిప్పంటించి దారుణం

13 Jul, 2022 13:19 IST|Sakshi

మెక్సికో: స్థానిక భాష మాట్లాడినందుకు 14 ఏళ్ల విద్యార్థికి తరగతి గదిలోనే నిప్పంటించారు తోటి విద్యార్థులు. ఈ దారుణ ఘటన మెక్సికో క్వెరెటరో రాష్ట్రంలో జూన్‌లో జరిగింది. తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. చాలా రోజుల చికిత్స అనంతరం ఈ వారమే డిశ్ఛార్జి అయ్యాడు. జాతి వివక్ష వల్లే తన కుమారుడిపై దాడి జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు విద్యార్థులు సహా పాఠశాల సిబ్బందిపై ఫిర్యాదు చేశారు.

దాడి జరిగిన ఈ విద్యార్థి పేరు జువాన్ జమొరానో. క్వెరెటరోలోని హైస్కూళ్లో చదవుతున్నాడు. అయితే ఇతను మెక్సికో సంప్రదాయ తెగ అయిన ఒటోమి కుటుంబం నుంచి వచ్చాడు. ఈ విషయం తెలిసి తోటి విద్యార్థులు అతడ్ని వివక్షపూరితంగా చూస్తున్నారు. ఓ రోజు ఇద్దరు విద్యార్థులు జువాన్ కూర్చొనే సీట్లో ఆల్కహాల్ పోశారు. అది చూసుకోకుండా అతను అలానే కూర్చుకున్నాడు. ప్యాంట్ తడిచాక విషయాన్ని గమినించి వెంటనే పైకి లేచాడు. ఆ సమయంలో ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు జూవన్‌కు నిప్పంటించారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

టీచర్‌ కూడా వేధిస్తోంది
పాఠాలు చెప్పే టీచర్‌ కూడా తమ బిడ్డను వేధించిందని ఆవేదన వ్యక్తం చేశారు జువాన్ తల్లిదండ్రులు. ఒటోమి భాష మాట్లాడితే తోటి విద్యార్థులు జువాన్‌తో గొడవపడేవారని, అతడ్ని వేధించేవారని తెలిపారు. అందుకే స్కూళ్లో ఆ భాష మాట్లాడాలంటేనే అతను భయంతో వణికిపోయేవాడని వివరించారు.

అధ్యక్షుడి రియాక్షన్‌
మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుల్ లోపెజ్‌ కూడా ఈ ఘటనపై స్పందించారు. అవసరమైతే ఈ కేసును దేశ అటార్నీ జరనల్ కార్యాలయం తమ చేతుల్లోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒటోమి భాష మాట్లాడటమే జువాన్ చేసిన నేరమా అని, జాతివివక్షను అంతం చేయడం అందరి బాధ్యత అని లోపెజ్‌ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు.

12.6కోట్ల జనాభా ఉన్న మెక్సికోలో జాతి వివక్ష దాడులు సాధారణం అయిపోయాయి. ఈ దేశంలో దాదాపు 2.3 కోట్ల మంది సంప్రదాయ తెగలకు చెందినవారున్నారు. వీరిలో 73లక్షల మంది స్థానిక భాషే మాట్లాడుతారు.  దాదాపు 40 శాతం మంది సంప్రదాయ తెగలు తమను వివక్షతో చూస్తున్నారని ఫిర్యాదు చేశారంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

చదవండి: ప్రధాని నివాసం వద్ద వేల మంది నిరసనకారులు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

మరిన్ని వార్తలు