ఆదిమజాతికి అడవి అప్పగించేశారు..అప్పగింత ఎందుకంటే

23 Oct, 2021 10:35 IST|Sakshi

ఎలాంజీల చేతిలోకి 1,60,000 హెక్టార్లు

ఖండాల్లో చిన్నది..భారతదేశం కంటే మూడింతలు పెద్దది ఆస్ట్రేలియా.. హిందూ మహాసముద్రం.. పసిఫిక్‌ మహా సముద్రం మధ్యలో ఉంటుంది ఈ ద్వీపం. ఆసీస్‌ అనగానే భారీ నగరాలే మన కళ్ల ముందు కనిపిస్తాయి. పెద్ద పెద్ద భవంతులు, పబ్బులు..క్లబ్బులు ఇంతే అనుకుంటాం..ఇంతకు మించి ఏదో ఉంది ఈ దేశంలో.. ఆస్ట్రేలియా అంటే ‘దక్షిణంలో ఉన్న అజ్ఞాత ప్రదేశం’ అని అర్థముంది. అందుకు తగ్గట్టే పైకి కనిపించని ఎన్నో విశేషాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి నగరంలో పచ్చదనం దట్టంగా ఉంటుంది. చెంగుచెంగున దూకే కంగారులు, అమాయకంగా చూసే కోలాలు విహారానికి కొత్త ఉత్తేజాన్నిస్తాయి

కడలి అంచులు బడలిక తీరుస్తాయి. నగరాలు దాటి అలా లోనికి వెళితే అడవులు ఎదురవుతాయి..ఆ అడవుల్లో పేరొందినవి...ప్రసిద్ధి చెందినవి కోకొల్లలు. అందులో ‘డెయిన్‌ట్రీ’ అడవులు మరీ ప్రత్యేకం.. ఈ అడవులను యునెస్కో చారిత్రక సంపదగా కూడా గుర్తించింది. ఇప్పుడు ఈ అడవుల ప్రస్తావన ఎందుకంటే...ఇంతవరకు ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్వహణలో ఉన్న వీటిని అక్కడ నివసించే ఆదిమజాతి వారసులైన తూర్పు కుకు ఎలాంజీ ప్రజలకు ఇటీవల అక్కడి ప్రభుత్వం అప్పగించింది. ఇక నుంచి డెయిన్‌ట్రీ అడవుల నిర్వహణ బాధ్యతను ఎలాంజీలు చేపట్టనున్నారని వీరికి క్వీన్స్‌లాండ్‌ రాష్ట్ర ప్రభుత్వం సహాయసహకారాలు అందజేయ నుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ అడవుల నిర్వహణతో పాటు సీడార్‌ బే, బ్లాక్‌మౌంటెన్, హోప్‌ ఐలాండ్‌లను కూడా ఎలాంజీలకు అప్పగించింది. 

వీటన్నిటి విస్తీర్ణం 1,60,000 హెక్టార్లకు పైమాటే..!
డెయిన్‌ ట్రీ విశేషాలు 

డెయిన్‌ట్రీ అడవులు 180 మిలియన్‌ సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు చరిత్ర పరిశోధకులు పేర్కొంటారు. 1988లో డెయిన్‌ ట్రీ అడవులను చారిత్రక సంపదగా యునెస్కో గుర్తించింది. 3,000 రకాలకుపైగా మొక్కల జాతులు, 107 రకాల జంతువులు, 368 రకాల పక్షులు, 113 రకాల సరీసృపాలకు ఈ అడవులు ఆవాసం. ఈ అడవుల్లో 2,656 చదరపు కిలోమీటర్ల పరిధిలో అన్ని రకాల పక్షులు నివసిస్తుంటాయి. ఆస్ట్రేలియాలో ఉండే కప్పల్లో 30 శాతానికి పైగా కప్పలు ఈ అడవుల్లోనే ఉంటాయి. 12,000కు పైగా సీతాకోకచిలుకలు, గబ్బిలాలు  ఇక్కడ ఉన్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది.

అప్పగింత ఎందుకంటే...

అడవుల నిర్వహణను ఎలాంజీలకు అప్పగించడం వల్ల ఆదిమజాతి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునే అవకాశాన్ని ఆ జాతికే ఇచ్చినట్లు అవుతుందని..తద్వారా ఆ జాతిలో కూడా నాయకత్వం అభివృద్ధి చెందుతుందని..కొన్నేళ్ల తరువాత పర్యాటకానికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఎలాంజీలను నియమించునున్నట్లు ఆస్ట్రేలియా పర్యావరణ శాఖ మంత్రి మీఘన్‌ స్కాన్‌లాన్‌ చెప్పారు.
 

మరిన్ని వార్తలు