ఏసీలు పేలి 17 మంది మృతి

6 Sep, 2020 04:38 IST|Sakshi

ఢాకా: బంగ్లా రాజధాని శివార్లలోని మసీదులో ఆరు ఎయిర్‌కండీషనర్లు పేలడంతో 17మంది మరణించారు. అండర్‌గ్రౌండ్‌ గ్యాస్‌పైప్‌లో లీకేజ్‌ కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. పేలుళ్లలో దాదాపు 20 మంది గాయపడ్డారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నారాయణ్‌గంజ్‌ పోర్టుటవున్‌లోని బైతుల్‌సలాత్‌ మసీద్‌లో శుక్రవారం ప్రార్ధనలకు భక్తులు సమవేశమయ్యారు. ఈ సమయంలో జరిగిన పేలుడులో చిన్నారితో సహా 11 మంది మృతి చెందారు.

గాయపడినవారి పరిస్థితి విషమంగానే ఉందని, ఎక్కువమంది శరీరాలు దాదాపు 90 శాతం వరకు కాలిపోయాయని, సగంమందికి ఊపిరితిత్తుల మార్గంలో గాయాలయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం పట్ల ప్రధాని షేక్‌ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సరైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. మసీదు దిగువన టైటస్‌ కంపెనీకి చెందిన గ్యాస్‌ పైప్‌లైన్‌ ఉందని, దీనిలోంచి గ్యాస్‌ లీకై మసీదులో నిండి ఉండొచ్చని, ఇదే సమయంలో ఏసీ లేదా ఫ్యాన్‌ ఆన్‌ చేయడంతో ఒక్కసారిగా అంటుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.  గతంలోనే ఈ పైప్‌లైన్‌ లీకేజ్‌లపై మసీదు కమిటీ ఫిర్యాదు చేసింది.    

మరిన్ని వార్తలు