జనవరి నాటికి అమెరికాలో టీకా

31 Oct, 2020 04:33 IST|Sakshi

అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ

షికాగో: అంతా అనుకున్నట్టుగా జరిగితే డిసెంబరు చివరి నాటికి, లేదా జనవరి ప్రారంభం నాటికి సురక్షితమైన, సమర్థవంతమైన తొలి కోవిడ్‌ వ్యాక్సిన్‌ అమెరికాలో అందుబాటులోకి వస్తుందని అంటువ్యాధుల నిపుణుడు, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆంథోనీ ఫౌసీ వెల్లడించారు. వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు మోడర్న, ఫైజర్‌లు ఇచ్చిన అంచనాల ప్రకారం రాబోయే కొద్ది వారాల్లోనే తొలి దశ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని, అది తొలుత హై రిస్క్‌లో ఉన్నవారికి అందించనున్నట్లు ఆయన తెలిపారు. జూలై చివర్లో ఈ రెండు కంపెనీలు చివరి దశ మానవప్రయోగాలు ప్రారంభించాయి.

తొలుత అక్టోబర్‌లో తాత్కాలిక ప్రయోగాల వివరాలను ప్రకటిస్తారని భావించినప్పటికీ, ప్రస్తుతం నవంబరు 3 వ తేదీకి ముందు డేటాను విడుదల చేసే అవకాశం లేదని ఫైజర్‌ తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం డేటాని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సమాచారాన్ని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ సమీక్షించాల్సి ఉంది. దాని ఫలితాల ఆధారంగా ప్రయోగాలు విజయవంతమైతే మొదటి డోస్‌లను ఎవరికి ఇవ్వాలని అనేది సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సిఫార్సులు చేస్తుంది. తొలి వ్యాక్సిన్‌ డోసులు డిసెంబర్‌ చివరినాటికి లేదా జనవరి ప్రారంభం నాటికి అత్యవసరమని భావించే వ్యక్తులకు ముందుగా అందిస్తారని ఫౌసీ తెలిపారు.

రష్యాలో టీకా ప్రయోగాలకు బ్రేక్‌
వ్యాక్సిన్‌ డోసుల కొరతతో టీకాప్రయోగాలను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. కొత్త డోసులు వచ్చే వరకు వాలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇవ్వడం సాధ్యం కాదని రష్యా అంటోంది. అదేవిధంగా, అమెరికా, భారత్‌ తర్వాత అత్యధికంగా ప్రభావితమైన దేశం బ్రెజిల్‌. కోవిడ్‌ వ్యాక్సిన్‌ అన్ని అనుమతులు పొంది, జూన్‌ నాటికి వినియోగంలోకి రావచ్చునని భావిస్తున్నట్లు బ్రెజిల్‌ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు వ్యాక్సిన్‌ల అభివృద్ధికి తుదిప్రయోగాలకు అనుమతులిచ్చారు.

మరిన్ని వార్తలు