షాకింగ్‌: రెండు పెంపుడు కుక్కలకు మరణశిక్ష.. ఎందుకంటే

13 Jul, 2021 14:02 IST|Sakshi

క‌రాచీ: మనుషులకు మరణశిక్ష విధిస్తారన్నది తెలిసిన విషయమే. కానీ ఓ దేశంలో విచిత్రంగా రెండు కుక్కలకు మరణ విధించారు. వినడానికి కాస్తా ఆశ్చ‌ర్యంగానే ఉన్న నిజంగానే పాకిస్థాన్‌లో రెండు పెంపుడు కుక్క‌ల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించారు. క‌రాచీలోని ఓ న్యాయవాదిపై దాడి చేశాయ‌న్న కార‌ణంగా రెండు జ‌ర్మ‌న్ షెప‌ర్డ్ కుక్కల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించ‌డం గమనార్హం. మీర్జా అక్త‌ర్ అనే సీనియ‌ర్ లాయ‌ర్ గ‌త నెల‌లో మార్నింగ్ వాక్ కోసం వెళ్లారు. అక్కడ ఓ రెండు కుక్క‌లు అతనిపై దాడి చేశాయి. 

ఈ దాడిలో ఆయ‌న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ దాడి దృశ్యాలన్నీ అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. అనంతరం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వడంతో అంతటి కౄరమైన కుక్కలను ఇళ్ల మ‌ధ్య ఉంచినందుకు య‌జ‌మానిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఇక అక్త‌ర్ లాయ‌ర్ కావడంతో అతను కోర్టుకు వెళ్లాడు. అయితే చివరికి కుక్కల యాజమాని హుమయూన్  ఖాన్‌ రాజీకి వచ్చాడు.

కానీ రాజీకి అంగీక‌రిస్తూనే లాయర్‌ అక్తర్‌ యాజమానికి పలు షరతులు పెట్టాడు. ఇంతటి దారుణం జరిగినందుకు తనకు వెంటనే క్షమాపణలు చెప్పాలని, భ‌విష్య‌త్తులో ఇలాంటి ప్ర‌మాద‌క‌ర కుక్క‌ల‌ను ఇంట్లో పెంచుకోవ‌ద్ద‌ని, అలాగే తనపై దాడి చేసిన ఆ కుక్క‌ల‌ను వెంట‌నే ఓ వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లి విష‌పూరిత ఇంజెక్ష‌న్ల‌తో చంపేయాల‌ని స‌ద‌రు య‌జ‌మానికి లాయ‌ర్ అక్త‌ర్ ష‌ర‌తులు విధించారు. ఈ ఒప్పందంపై ఇద్ద‌రూ సంత‌కాలు చేసి కోర్టులో స‌మ‌ర్పించారు. అయితే ఈ ఒప్పందంపై హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు తీవ్రంగా మండిప‌డుతున్నారు.

మరిన్ని వార్తలు