ముసలి వేషంతో కరోనా టీకా, కానీ..

20 Feb, 2021 08:39 IST|Sakshi

వాషింగ్టన్‌ : నిబంధనలు ఉల్లంఘించి ఇద్దరు మహిళలు అక్రమం‍గా కరోనా టీకాను తీసుకున్నారు. ఇందుకు తమను తాము పెద్దవారిలా కనిపించేలా వేషధారణ మార్చి అధికారులను బురిడీ కొట్టించారు. ఈ ఘటన అమెరికాలోని ఓర్లాండోలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..35, 45 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు తమకు 65పైబడినట్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇందుకు తగ్గట్లుగానే పెద్దవారిలా మారువేషం వేసుకొని కోవిడ్‌ టీకా సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ వారి పేర్లు, సంబంధిత రిజిస్ట్రేషన్‌ ఐడీతో సరిపోలడంతో అధికారులు వారికి వ్యాక్సిన్‌  మొదటి డోస్‌ను  వేసి ఇంటికి పంపించారు. అయితే వారి పుట్టినతేదీ వివరాలు మ్యాచ్‌ కావడం లేదని తర్వాత పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది.

ఇద్దరు మహిళలు చేసిన టీకా మోసంతో అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. ఈ విషయంపై వెంటనే పై అధికారులకు సమాచారం అందించారు. అయితే వారు ఏ సెంటర్‌ నుంచి మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ పొందారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. 'మీకంటే అత్యంత ఎక్కువ అవసరం ఉన్న వారి వద్ద నుంచి మీరు వ్యాక్సిన్‌ను దొంగిలించారు' అని ఆరోగ్యశాఖ ప్రతినిధి తెలిపారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాలని, అరెస్ట్‌ తప్పదని హెచ్చరించారు. అసలు ఆ మహిళలు ఎవరి నుంచి అపాయ్‌ంట్‌మెంట్‌ పొందారు? ఈ విషయంలో ఎవరైనా సహాయం చేశారా వంటి విషయాలపై సమగ్ర దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. 

చదవండి :  (రిపోర్టర్‌ లైవ్‌ చేస్తుండగా.. గన్‌తో బెదిరించి దోపిడి)
(పాపం లిగాన్‌.. 68 ఏళ్లు జైల్లో.. అందర్నీ కోల్పోయి..)


 

మరిన్ని వార్తలు