పామును ముక్కలుగా కొరికేసిన రెండేళ్ల చిన్నారి!

15 Aug, 2022 17:38 IST|Sakshi

ఇస్తాంబుల్‌: పాములు పగ తీర్చుకునే సంఘటనలు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. నిజ జీవితంలోనూ అక్కడక్కడ జరిగినట్లు తెలుసు. కానీ, పాముపై పగ తీర్చుకున్న సంఘటన ఎప్పుడైనా విన్నారా? అవునండీ.. నిజమే, తనను కాటు వేసిందనే కోపంతో ఓ రెండేళ్ల చిన్నారి పాముపై పగ తీర్చుకుంది. దానిని నోటితో ముక్కలు ముక్కలు చేసింది. ఈ సంఘటన టర్కీలోని కంతార్‌ గ్రామంలో జరిగింది. 

గ్రామంలోని తన ఇంటి వెనకాల పెరటిలో చిన్నారి ఆడుకుంటోంది. ఒక్కసారిగా పెద్దగా అరిచింది. దీంతో ఏదో జరిగిందని ఆందోళన చెందిన చుట్టుపక్కలవారు పరుగున పెరట్లోకి వెళ్లారు. అయితే, ఆ చిన్నారిని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పాప నోట్లో పాము ఉంది. మరోవైపు.. చిన్నారి కింది పెదవిపై పాము కాట్లు ఉన్నాయి. వెంటనే చిన్నారికి ప్రథమ చికిత్స అందించి స్థానిక బింగోల్‌ మెటర్నిటీ, చిల్డ్రెన్స్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమక్షంలో 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచారు. చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. 

‘మా పాప చేతిలో పాము ఉన్నట్లు ఇరుగుపొరుగు వాళ్లు నాకు చెప్పారు. దాంతో ఆమె ఆడుకుంటుండగా కాటు వేసింది. ఆ కోపంతో ఆమె పామును కొరికేసింది.’ అని పాప తండ్రి మెహ్మెట్‌ ఎర్కాన్‌ పేర్కొన్నారు. మరోవైపు.. పాము కాటుకు గురైన ఓ 8 ఏళ్ల బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన సంఘటన టర్కీలోని మరో ప్రాంతంలో జరిగింది. చేతిపై కాటు వేయటంతో సాదారణ సైజ్‌తో పోలిస్తే ఐదింతలు ఉబ్బిపోయినట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి: పోలీసులకు చిక్కకుండా గర్ల్‌ఫ్రెండ్‌ టెడ్డీబేర్‌లో దాక్కున్న దొంగ.. చివరికి

మరిన్ని వార్తలు