కోవిడ్ మొదలైన రెండేళ్ల తర్వాత అక్కడ తొలి కేసు..

4 Dec, 2021 15:21 IST|Sakshi

వెల్లింగ్టన్‌:  ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కంటిమీద కునుకులేకుండా చేసిన సంగతి తెలిసిందే. ఈ వైరస్‌ ధాటికి ఇప్పటికీ అనేక దేశాలు వణికి పోతున్నాయి. అయితే, చాలా దేశాలు కరోనా నిబంధలను, వ్యాక్సిన్‌లు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్గించాయి. దీంతో కొన్ని చోట్ల వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గింది.

కరోనా వైరస్‌ బయట పడిన రెండేళ్లకు న్యూజిలాండ్‌లోని ఒక దీవిలో తొలికేసు నమోదైంది. ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. కాగా, దక్షిణ పసిఫిక్‌ దేశంలో కుక్‌ ఐలాండ్‌ అనే దీవి ఉంది.  ఆ దీవిలో 17000 మంది జనాభా ఉన్నారు. కరోనా వెలుగు చూసిన నాటి నుంచి ఆ దీవిలో కరోనా ఆంక్షలు, టీకాలు వేసుకునేలా ఆ దీవి ప్రధాని మార్క్‌ బ్రౌన్‌ అవగాహన కల్పించారు.

ఇప్పటి వరకు ఆ దీవిలో 96 శాతం మంది ప్రజలు రెండు డోసుల టీకాలు వేసుకున్నారు. కొత్తగా న్యూజిలాండ్‌ నుంచి వచ్చిన పదేళ్ల  బాలుడిలో కరోనా వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆ బాలుడి కుటుంబం న్యూజిలాండ్‌ నుంచి, కుక్‌ ఐలాండ్‌ దీవికి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. వెంటనే బాలుడిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచారు. వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు స్థానిక వైద్య సిబ్బంది తెలిపారు.

వారి రిపోర్టు రావాల్సి ఉంది.  వచ్చే ఏడాది జనవరి నుంచి కుక్‌ ఐలాండ్‌ దీవికి పర్యాటకులను అనుమతించే క్రమంలో తొలి కేసు నమోదుకావడం పట్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా,  ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ ప్రపంచం వ్యాప్తంగా  కలకలం రేపిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు