20 దేశాల నుంచి బిలియన్‌ డోసులు ప్రి ఆర్డర్‌‌

11 Aug, 2020 19:01 IST|Sakshi

మాస్కో: ప్రపంచ దేశాలన్ని కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా తీసుకొస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు పేరును కూడా ఖరారు చేసింది. ‘స్పుత్నిక్ వీ’  పేరుతో కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేసిన్‌ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ డిమిత్రియేవ్ వెల్లడించారు. ‘స్పుత్నిక్ వీ’కి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌కు సంబంధించి వచ్చే తప్పుడు వివరాలను ఖండించడమే కాక వాస్తవాలను తెలియజేస్తామన్నారు. బుధవారం నుంచి ఫేస్ 3 ట్రయల్స్ ప్రారంభమవుతాయని తెలిపారు. సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. (గుడ్‌న్యూస్‌ : తొలి వ్యాక్సిన్‌ వచ్చేసింది!)

20 దేశాల నుంచి బిలియన్ డోసులకు ఆర్డర్
అంతేగాక, ప్రపంచంలోని 20 దేశాలు ఇప్పటికే బిలియన్ డోసుల కంటే ఎక్కువగా ప్రి ఆర్డర్ చేశాయని కిరిల్ వివరించారు. కాగా, రష్యా దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే, కట్టడి సమర్థవంతంగా చేయడంతో ఇటీవల కాలంలో ఎక్కువ కేసులు నమోదు కావడం లేదు. రష్యాలో ఇప్పటి వరకు 8,97,599 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 15,131 మంది కరోనా బారినపడి మరణించారు. తాజాగా 4,945 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.  కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో యూఎస్ఏ, బ్రెజిల్, ఇండియాల తర్వాత రష్యా కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు