బైడెన్‌ బృందంలో 20 మంది ఇండో అమెరికన్లు

18 Jan, 2021 01:56 IST|Sakshi
బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి ముస్తాబవుతున్న క్యాపిటల్‌ హిల్‌ భవనం

వారిలో 13 మంది మహిళలే

కీలక బాధ్యతలు అప్పగించిన కాబోయే అధ్యక్షుడు బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా మరో రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించబోతున్న జో బైడెన్‌ బృందంలో భారతీయ అమెరికన్లు కీలక పాత్ర పోషించనున్నారు. ముఖ్యమైన పదవుల్లో బైడెన్‌ ఇప్పటికే కనీసం 20 మంది ఇండో అమెరికన్లను నియమించారు. వారిలో 13 మంది మహిళలే కావడం విశేషం. అలాగే, వైట్‌హౌజ్‌ నుంచి బాధ్యతలు నిర్వహించే శక్తిమంతమైన బైడెన్‌ పాలన బృందంలో 17 మంది భారతీయ అమెరికన్లు కీలకంగా వ్యవహరించనున్నారు. వారిలో మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌గా నామినేట్‌ అయిన నీరా టాండన్‌ ఒకరు. బైడెన్‌ డిప్యూటీగా ఉపాధ్యక్ష పదవికి ఆఫ్రో–ఇండియన్‌ మూలాలున్న కమలా హ్యారిస్‌ ఎన్నికైన విషయం తెలిసిందే. జనవరి 20న దేశాధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమల ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

బైడెన్‌ యంత్రాంగంలో కీలక బాధ్యతలు పోషించబోతున్న ఇండో అమెరికన్లలో.. యూఎస్‌ సర్జన్‌ జనరల్‌గా ఎంపికైన వివేక్‌ మూర్తి, న్యాయ విభాగంలో అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా ఎంపికైన వనిత గుప్తా,  సివిలియన్‌ సెక్యూరిటీ, డెమొక్రసీ, హ్యూమన్‌రైట్స్‌కు అండర్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌గా ఎంపికైన ఉజ్రా జెయా, బైడెన్‌ భార్య, కాబోయే ఫస్ట్‌ లేడీ డాక్టర్‌ జిల్‌ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా ఎంపికైన మాలా అడిగ, జిల్‌ బైడెన్‌ డిజిటల్‌ డైరెక్టర్‌గా ఎంపికైన గరీమా వర్మ, వైట్‌ హౌజ్‌ డెప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా ఎంపికైన సబ్రీనా సింగ్, వైట్‌హౌజ్‌ నేషనల్‌ ఎకనమిక్‌ కౌన్సిల్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికైన భరత్‌ రామమూర్తి, వైట్‌హౌజ్‌ ప్రెసిడెన్షియల్‌ పర్సనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికైన గౌతమ్‌ రాఘవన్‌  తదితరులున్నారు.

కశ్మీరీ మూలాలున్న అయిషా షా వైట్‌హౌజ్‌ ఆఫీస్‌ ఆఫ్‌ డిజిటల్‌ స్ట్రాటెజీలో పార్ట్‌నర్‌షిప్‌ మేనేజర్‌గా, సమీరా ఫజిలి వైట్‌హౌజ్‌లోని యూఎస్‌ నేషనల్‌ ఎకనమిక్‌ కౌన్సిల్‌లో డెప్యూటీ డైరెక్టర్‌గా ఎంపిక కావడం విశేషం. మరోవైపు, జో బైడెన్‌ సన్నిహిత బృందంలో ఒకరైన వినయ్‌ రెడ్డి డైరెక్టర్, స్పీచ్‌ రైటింగ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అసిస్టెంట్‌ ప్రెస్‌ సెక్రటరీ టు ద ప్రెసిడెంట్‌గా యువకుడైన వేదాంత్‌ పటేల్‌ను ఎంపిక చేశారు. నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లో టెక్నాలజీ అండ్‌ నేషనల్‌ సెక్యూరిటీ సీనియర్‌ డైరెక్టర్‌గా తరుణ్‌ ఛాబ్రా, సీనియర్‌ డైరెక్టర్‌ ఫర్‌ సౌత్‌ ఏసియాగా సుమొన గుహ, కోఆర్డినేటర్‌ ఫర్‌ డెమొక్రసీ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌గా శాంతి కళాతిల్‌లను బైడెన్‌ ఎంపిక చేశారు. క్లైమేట్‌ పాలసీ అండ్‌ ఇన్నోవేషన్‌లో సీనియర్‌ అడ్వైజర్‌గా సోనియా అగర్వాల్, వైట్‌హౌజ్‌ కోవిడ్‌–19 రెస్పాన్స్‌ టీమ్‌కి పాలసీ అడ్వైజర్‌ ఫర్‌ టెస్టింగ్‌గా విదుర్‌ శర్మ కూడా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. వైట్‌హౌజ్‌ న్యాయవిభాగంలో అసోసియేట్‌ కౌన్సెల్‌గా నేహ గుప్తా, డిప్యూటీ అసోసియేట్‌ కౌన్సెల్‌గా రీమా షా ఇండో అమెరికన్‌ మహిళల శక్తిసామర్థ్యాలను చూపనున్నారు.  

కోలం ముగ్గులు
అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా బైడెన్, కమల ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రారంభ సూచికగా శనివారం జరిగిన వర్చువల్‌ కార్యక్రమంలో భారత్‌లోని తమిళనాడుకు చెందిన సంప్రదాయ కోలం ముగ్గులు ఆకట్టుకున్నాయి. బైడెన్, కమలలను ఆహ్వానిస్తూ వేలాది కోలం డ్రాయింగ్స్‌తో ఒక వీడియోను రూపొందించారు. ఈ కార్యక్రమంలో యూఎస్, ఇండియా నుంచి 1,800 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు.  ఆరోగ్యం, సౌభాగ్యాలను ఆహ్వానిస్తూ తమిళనాడులోని గృహిణులు తమ ఇళ్లల్లో, ఇళ్ల ముందు వీటిని వేస్తారు. కమల తల్లి శ్యామల తల్లి స్వస్థలం తమిళనాడేనన్న విషయం తెలిసిందే.  

తొలి రోజు సుమారు డజను నిర్ణయాలు
అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు బైడెన్‌ సుమారు డజను అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. వాటిలో అమెరికా ఎదుర్కొంటున్న నాలుగు ప్రధాన సంక్షోభాలు.. కోవిడ్, ఆర్థిక రంగ మందగమనం, వాతావరణ మార్పు, జాత్యహంకారం.. వీటి నివారణలపై చర్యలు చేపట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటారని వైట్‌హౌజ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రాన్‌ క్లెయిన్‌ వెల్లడించారు. అమెరికన్‌ విద్యార్థుల రుణాల చెల్లింపుల గడువు పొడిగింపు, పారిస్‌ ఒప్పందంలో మళ్లీ చేరడం, ముస్లింలపై నిషేధాన్ని తొలగించడం.. తదితర అంశాలపై తొలి పది రోజుల్లో నిర్ణయాలుంటాయన్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 1.1 కోట్ల వలసదారులకు లీగల్‌ స్టేటస్‌ కల్పించే విషయానికి బైడెన్‌ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ విషయంలో ప్రధాన పార్టీలైన డెమొక్రటిక్, రిపబ్లికన్‌ సభ్యుల్లోనూ అంతర్గతంగా విభేదాలున్న విషయం తెలిసిందే. ఈ విభేదాల నేపథ్యంలో.. ఎప్పుడు బైడెన్‌  దీన్ని అమలు చేస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. అయితే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే బైడెన్‌ సంబంధిత ఇమిగ్రేషన్‌ బిల్లును కాంగ్రెస్‌కు పంపిస్తారని రాన్‌ క్లెయిన్‌ స్పష్టం చేశారు.

కమలా హ్యారిస్‌ ప్రమాణం
తొలి మహిళా ఉపాధ్యక్షురాలు, తొలి దక్షిణాసియా మూలాలున్న ఉపాధ్యక్షురాలు, తొలి బ్లాక్‌ ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించనున్న కమలా హ్యారిస్‌తో జనవరి 20న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోనియా సొటొమేయర్‌ ప్రమాణ స్వీకారం చేయించ నున్నారు. జస్టిస్‌ సోనియా కూడా యూఎస్‌ సుప్రీంకోర్టులో తొలి హిస్పానిక్‌  న్యాయమూర్తి, మూడో మహిళా న్యాయమూర్తి కావడం గమనార్హం. గతంలో జస్టిస్‌ సోనియా న్యూయార్క్‌లో, కమలా హ్యారిస్‌ కాలిఫోర్నియాలో ప్రాసిక్యూటర్లుగా పనిచేశారు. ప్రమాణ స్వీకారం సమయంలో కమల రెండు బైబిల్స్‌ను చేతిలో పట్టుకుని ప్రమాణం చేస్తారు. ఆ రెండు బైబిల్స్‌లో.. ఒకటి తన తల్లిలాంటి రెజీనా షెల్టన్‌ది కాగా, మరొకటి అమెరికా మానవ హక్కుల నేత, సుప్రీంకోర్టు తొలి ఆఫ్రో అమెరికన్‌ న్యాయమూర్తి తర్గుడ్‌ మార్షల్‌ది కావడం విశేషం. పాఠశాలలో చదువుకునే రోజుల్లో స్కూల్‌ ముగియగానే.. కమల తన సోదరి మాయతో కలిసి తమ ఇంటికి రెండు ఇళ్ల దూరంలో ఉన్న రెజీనా ఇంటికే వెళ్లేవారు. గతంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా, తరువాత సెనెటర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో రెజీనా షెల్టన్‌ బైబిల్‌నే కమలా హ్యారిస్‌ తీసుకువెళ్లారు.

వినయ్‌ రెడ్డి, వనితా గుప్తా, సబ్రినా సింగ్‌, భరత్‌ రామ్మూర్తి, సమీరా ఫజిలి


వివేక్‌మూర్తి, మాలా అడిగ, నీరా టాండన్‌, గౌతమ్‌ రాఘవన్‌, వేదాంత్‌ పటేల్‌

మరిన్ని వార్తలు