కాబూల్‌ వర్సిటీలో కాల్పులు

3 Nov, 2020 06:20 IST|Sakshi
ఘటన తర్వాత వర్సిటీ వద్ద పోలీసు పహారా

దాదాపు 20 మంది మృతి

పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతం

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని కాబూల్‌ విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం కాల్పులు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో కనీసం 25 మంది మృతి చెందడంగానీ, గాయపడటంగానీ జరిగిందని అఫ్గానిస్తాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. అయితే, ఎంతమంది చనిపోయారు, ఎంత మంది గాయపడ్డారనే కచ్చితమైన సమాచారం వెల్లడించలేదు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. 20 మంది మరణించి ఉంటారని అంచనా. యూనివర్సిటీలో పుస్తక ప్రదర్శన జరుగుతుండగా ముగ్గురు వ్యక్తులు హఠాత్తుగా తుపాకులతో కాల్పులు ప్రారంభించినట్లు సమాచారం. అఫ్గానిస్తాన్‌లోని ఇరాన్‌ రాయబారి ఈ పుస్తక ప్రదర్శనకు హాజరయ్యారు. కాల్పుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వర్సిటీ ప్రాంగణాన్ని చుట్టుముట్టారు. వర్సిటీకి దారితీసే రోడ్లను మూసివేశారు. ముష్కరులు, పోలీసుల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. కొన్ని గంటల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసుల ఎదురుదాడిలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. కాబూల్‌ విశ్వవిద్యాలయంలో కాల్పులు తామే జరిపామంటూ ఇప్పటిదాకా ఉగ్రవాద సంస్థలేవీ ప్రకటన జారీ చేయలేదు. సాయుధులైన ఉగ్రవాదులు కాబూల్‌ యూనివర్సిటీపై జరిపిన దాడిని ప్రధాని మోదీ ఖండించారు. 

మరిన్ని వార్తలు