కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి

9 Apr, 2022 14:01 IST|Sakshi

వాషింగ్టన్‌: కెనడాలో జరిగిన కాల్పుల్లో భారత విద్యార్థి ఒకరు మృతి చెందారు. టొరంటో నగరంలోని సబ్‌వే స్టేషన్‌ ప్రవేశ ద్వారం వద్ద గురువారం సాయంత్రం దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భారత్‌కు చెందిన కార్తీక్‌ వాసుదేవ్‌ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు, ప్రత్యక్ష సాక్షులు, సీసీ టీవీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

వాసుదేవ్‌ హత్యపై టోరంటోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ‘గురువారం టొరంటోలో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ విద్యార్థి కార్తిక్ వాసుదేవ్ దురదృష్టవశాత్తు మృతి చెందాడు. అతని మరణం పట్ల మేము దిగ్భ్రాంతి చెందాం. మృతుడి కుటుంబంతో టచ్‌లో ఉన్నాం. మృతదేహాన్నిస్వదేశానికి తీసుకొచ్చేందుకు సాధ్యమైన సాయాన్ని అందిస్తాము’ అని ట్విట్టర్‌లో తెలిపింది. 

స్పందించిన విదేశాంగ మంత్రి
కెనడాలో భారత విద్యార్థి మృతిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అయితే వాసుదేవ్‌ స్థానిక సెనెకా కాలేజ్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడని, సబ్‌వేలో ఉద్యోగానికి వెళ్తుండగా హత్య జరిగినట్లు అతని సోదరుడు తెలిపారు. కాగా వాసుదేవ్‌ ఈ జనవరిలోనే కెనడా వెళ్లాడు. 

మరిన్ని వార్తలు