భూమిపై పడనున్న 23 టన్నుల చైనా రాకెట్‌ శకలాలు

3 Nov, 2022 21:15 IST|Sakshi

సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోన్న చైనా.. అందుకోసం రాకెట్లను పంపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అంతరిక్షంలోకి చేరుకున్న ఓ భారీ రాకెట్‌ శకలాలు భూమిపై పడనున్నాయి. ఈ వారాంతంలోనే భూమిని తాకనున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త తియాంగాంగ్‌ స్పేష్‌ స్టేషన్‌ కోసం మూడో మోడ్యూల్‌ను పంపించేందుకు 23 టన్నుల లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌ను అంతరిక్షంలోకి ఇటీవలే ప్రయోగంచింది చైనా. ఆ రాకెట్‌కు చెందిన 23 టన్నుల బరువుండే శకలాలు ఈ వారాంతంలోనే భూవాతావరణంలోకి ప్రవేశించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఈ శిథిలాల వల్ల మానవాళికి ఏర్పడే ప్రమాదంపై అంచనా వేస్తున్నారు. అవి ఎక్కడ పడనున్నాయనే విషయం స్పష్టంగా తెలియదని హెచ్చరిస్తున్నారు.

ఈ రాకెట్‌ భూకక్ష్యను చేరుకున్న తర్వాత భూమిపైకి తిరిగి ప్రవేశిస్తుంది. ఇందుకు సంబంధించిన 28 గంటల రీఎంట్రీ విండో శుక్రవారం సాయంత్రం నుంచి మొదలై శనివారమంతా కొనసాగుతుంది. సుమారు 10 అంతస్తుల పెద్ద భవన అంత పెద్దగా ఉండే ఈ రాకెట్‌ భూవాతావరణంలోకి చేరుకున్న తర్వాత కొంతభాగం కాలిపోతుంది. మిగిలిన కొన్ని ప్రధాన భాగాలు అలాగే భూమిపై పడుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు.. దీని వల్ల కొంత ప్రమాదం ఉండొచ్చని ఏరోస్పేస్‌ కార్పొరేషన్‌ చెబుతోంది. 88శాతం ప్రపంచ జనాభా నివసించే ప్రాంతాల్లో ఇవి పడే అవకాశముందట. అయితే శకలాల్లో చాలా వరకు జనసాంద్రత తక్కువ ఉండే ప్రదేశాలు.. సముద్రాలు, ఖాళీ ప్రదేశాల్లో పడే అవకాశం ఉండటంతో ముప్పు కాస్త తగ్గొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: ఉత్తర కొరియా కవ్వింపు చర్య.. తీవ్ర ఉద్రిక్తత, జపాన్‌, సౌత్‌ కొరియా అలర్ట్‌

మరిన్ని వార్తలు