అమెరికా స్థావరాల్లో అఫ్గాన్‌ శరణార్థులు

29 Aug, 2021 04:21 IST|Sakshi
అఫ్గానిస్తాన్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శరణార్థులను కింద పేర్కొన్న స్థావరాలకు తరలిస్తున్నారు.

మిలటరీ బేస్‌ల్లో తాత్కాలిక నివాసాలు

సంక్షోభంలో ఉన్న అఫ్గానిస్తాన్‌ నుంచి భయంతో వలస వస్తున్న శరణార్థుల కోసం అమెరికా మరో మూడు మిలటరీ బేస్‌లను కేటాయించింది. ఇప్పటికే మధ్యప్రాచ్యం, యూరప్‌లో శరణార్థుల కోసం కేటాయించిన స్థావరాలతో పాటు తాజాగా మెరైన్‌ కార్ప్స్‌ బేస్, ఫోర్ట్‌ పికెట్, హోలోమ్యాన్‌ ఎయిర్‌బేస్‌లను సైతం వీరి కోసం కేటాయిస్తున్నట్లు యూఎస్‌ ప్రతినిధి జాన్‌ కిర్బే చెప్పారు. అఫ్గాన్‌ స్పెషల్‌ వీసా ఉన్న దరఖాస్తుదారులు, వారి కుటుంబసభ్యులు, రిస్కు ఎదుర్కొంటున్న వ్యక్తులను అఫ్గాన్‌ నుంచి తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నామని, ఈ మిషన్‌ కు అదనపు మద్దతు కోసం కొత్త బేస్‌లను కేటాయించామని కిర్బే తెలిపారు.చదవండి: అమెరికా, చైనా మధ్య తొలిసారి సైనిక చర్చలు

దీంతో అఫ్గాన్‌ శరణార్థుల కోసం అమెరికా స్వదేశంలో కేటాయించిన స్థావరాల సంఖ్య ఏడుకు చేరిందన్నారు. ఇవి కాకుండా ఖతార్, బహ్రెయిన్, జర్మనీల్లో అమెరికాకు మరో 10 స్థావరాలున్నాయని ఆయన వివరించారు. అమెరికాలోని అన్ని స్థావరాలు కలిసి 70 వేల మందికి ఆశ్రయం కల్పించగలవని కిర్బే చెప్పారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించే విషయంలో మిలటరీకి హోమ్‌ల్యాండ్‌ శాఖ, ఆరోగ్య శాఖ సహాయం చేస్తున్నాయని వివరించారు. సరిహద్దు దేశాలేవీ అఫ్గానిస్తాన్‌ పౌరులను రానీయకపోవడంతో వీరంతా అమెరికా ఆశ్రయం కోసం ఎదురు చూస్తూ విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు.    చదవండి: విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు 

ఏ బేస్‌లో ఎంతమంది?
జర్మనీలోని రమ్‌స్టెయిన్‌ బేస్‌కు గతవారం దాదాపు 7,500మంది శరణార్థులు వచ్చారు. ఈ బేస్‌ సామర్ధ్యం 12వేలని అధికారులు చెప్పారు.  బహ్రెయిన్‌లోని ఇసా ఎయిర్‌బేస్‌లో 5 వేల మందికి ఆశ్రయం కల్పించే యత్నాలు జరుగుతున్నాయి. ఫోర్ట్‌ బ్లిస్‌లో 650 మందికి ఆవాసం కల్పించారు. దీని సామర్థ్యం పదివేలని అధికారులు చెప్పారు. ఫోర్ట్‌ డిక్స్‌లో 9,500 మందికి టెంట్‌ హౌస్‌ల్లో నివాసం కల్పించారు. అయితే కొన్ని బేస్‌ల్లో పరిస్థితి ఘోరంగా ఉందని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి.

అల్‌ ఉదైద్‌ బేస్‌లో పరిస్థితి నరకం కన్నా హీనంగా ఉందని, ఎలుకలు తిరుగుతున్నాయని అధికారులు చెప్పారు. మరోవైపు మిలటరీ బేస్‌ల్లో శరణార్థు లకు తాత్కాలిక నివాసం కల్పిస్తున్నారు కానీ, తర్వాత వీరిని ఎక్కడకు తరలిస్తారన్న విషయమై అమెరికా స్పష్టత ఇవ్వలేదు. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు వీరికి శాశ్వత ఆవాసం కల్పించేందుకు ముందుకువస్తున్నారు. ఈ బేస్‌లను అధ్యక్షుడు బైడెన్‌ సందర్శించాల్సి ఉన్నా, కాబూల్‌ పేలుళ్ల కారణంగా  వాయిదా పడింది. సరిహద్దు దేశాలు మానవతా ధృక్పధంతో శరణార్థులకు ఆశ్రయం కల్పించాలని ఐరాస కోరింది.
 
 –నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు