మనుషులు లేని దీవిలో ఆ ముగ్గురు 33 రోజుల పాటు..

11 Feb, 2021 17:06 IST|Sakshi

బహమాన్ దీవుల్లోని అంగుయిలా కేలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు

33 రోజుల తర్వాత వారిని కాపాడిన అమెరికా కోస్ట్‌ గార్డు

వాషింగ్టన్‌: తెలియని ప్రాంతంలో ఒక్క పూట గడపాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటిది నర సంచారం లేని దీవిలో.. తిండి తిప్పలు లేకుండా నెల రోజులకు పైగా గడపడం అంటే మాటలు కాదు. ఇలాంటి భయంకర పరిస్థితి ఎదురయ్యింది ముగ్గురు వ్యక్తులకు. వీరంతా 33 రోజుల పాటు మనుషుల్లేని దీవిలో బందీలయ్యారు. నాలుగో మనిషి కనబడడు.. ఆహారం, నీరు లేదు. అదృష్టం కొద్ది అక్కడ కొబ్బరి చెట్లు ఉండటంతో.. ఇన్నాళ్లు బతికి బట్టకట్టగలిగారు. చివరకు 33 రోజుల తర్వాత ఆ దీవి నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ఇంతకు వీరంతా ఆ దీవిలోకి ఎందుకు వెళ్లారు.. ఎలా బయటపడగలిగారు అనే విషయాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.. 

క్యూబాకు చెందిన ఓ మహిళ, ఇద్దరు పురుషులు.. పడవలో సముద్రంలోకి వెళ్లారు. అలల తాకిడి ఎక్కువ కావడం వల్ల వారు ప్రయాణిస్తున్న పడవ బొల్తా పడింది. ఊహించని ఈ ప్రమాదానికి వారు బిక్క చచ్చిపోయారు. ఎలానో ధైర్యం తెచ్చుకుని చేతికి అందిన వస్తువులను పట్టుకుని సమీపంలోని దీవి వరకు ఈదుకుంటూ వెళ్లిపోయారు. ఇక వారు చేరుకున్న దీవి నర సంచారం ఉండని బహమాన్ దీవుల్లోని అతి చిన్న ద్వీపం అంగుయిలా కే. ఒడ్డుకు అయితే చేరగలిగారు కానీ అక్కడి నుంచి బయటపడే మార్గ కనిపించలేదు. చేసేదేం లేక అటుగా ఏమైనా ఓడలు, విమానాలు వస్తే సాయం అడగవచ్చని భావించి.. కాలం గడపసాగారు.

ఇలా ఓ మూడు రోజులు గడిచాయి. వారితో తెచ్చుకున్న ఆహారం మొత్తం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దీవిలో ఏమైనా పండ్ల చెట్ల లాంటివి ఉంటాయేమోనని వెతకడం ప్రారంభించారు. అదృష్టం కొద్ది వారికి కొబ్బరి చెట్లు కనిపించాయి. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. మొదట్లో కొబ్బరి బొండాల్లో నీరు తాగి, కొబ్బరిని తిని రోజులు వెళ్లదీశారు. కానీ ఎన్ని రోజులని ఇలా. సరైన ఆహారం లేక.. కేవలం కొబ్బరి మాత్రమే తీసుకుంటుండటంతో వారిలో నీరసం బాగా పెరిగిపోయింది. రోజులు గడుస్తున్న కొద్ది నీరసం పెరగుతోంది.. బతుకు మీద ఆశ తగ్గుతోంది. ఇక తామంతా ఆ దీవిలోనే ఆకలితో అలమటించి సజీవ సమాధి అవ్వక తప్పదని భావించారు. అలా 33 రోజుల గడిచిపోయాయి. 

ఈ క్రమంలో ఫిబ్రవరి 8న అమెరికాకు చెందిన కోస్ట్ గార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి అటుగా ఎగురుతూ వచ్చింది. ఆ శబ్దం వారిలో చనిపోయిన ఆశలను రేకేత్తించింది. బతికిపోయాం.. ఇక బయటపడతాం అని భావించారు. తమ దగ్గరున్న దుస్తులను జెండాలుగా ఊపుతూ.. తమ గురించి ఎయిర్‌ క్రాఫ్ట్‌లోని వారికి అర్థం అయ్యేలా చేశారు. ఇక విమానంలో ఉన్న వారికి కింద ఏవో జెండాలు కదులుతున్నట్లు తోచి.. కాస్త కిందకు వచ్చారు. అక్కడ ఈ ముగ్గురిని చూసి షాకయ్యారు. ఆ తర్వాత పైలెట్‌ వీరి గురించి అధికారులకు తెలియజేశాడు. దాంతో ఆ దీవి వద్దకు హెలికాప్టర్‌ను పంపి ఆ ముగ్గురికి నీళ్లు, ఆహారంతో పాటు వారితో మాట్లాడేందుకు వీలుగా ఓ రేడియో వాకీ టాకీని కూడా అందించారు. 

అయితే, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అదే రోజు వారిని రక్షించలేకపోయారు. దాంతో ఫిబ్రవరి 9న మరో రెస్క్యూ హెలికాప్టర్ అక్కడికి చేరుకుని ముగ్గురిని రక్షించింది. అనంతరం వారిని హాస్పిటల్‌కు తరలించారు. లక్కీగా వారిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.. నీరసం మినహా ఇతర అనారోగ్య సమస్యలు ఏం లేవని.. పూర్తి  ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇక వీరిని కాపాడిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. మీకింకా భూమ్మీద నూకలున్నాయి.. అందుకే బయటపడ్డారు.. మరో సారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి అంటూ నెటిజనులు సూచిస్తున్నారు.

చదవండి: ఆరోగ్యం... క్యూబా భాగ్యం!
                 స్కూల్‌ ఫీజుకు బదులుగా కొబ్బరి బొండాలు..!

మరిన్ని వార్తలు