కృష్ణబిల పరిశోధనలకు పట్టం

7 Oct, 2020 01:44 IST|Sakshi
రైన్‌హార్డ్‌ గెంజెల్,‌ రోజర్‌ పెన్‌రోజ్‌, ఆండ్రియా గేజ్‌

బ్రిటన్, జర్మనీ, అమెరికన్‌ శాస్త్రవేత్తలకు సంయుక్తంగా భౌతికశాస్త్ర నోబెల్‌ 

కృష్ణబిలంపై మన అవగాహనను మరింత పెంచిన శాస్త్రవేత్తలు  

స్టాక్‌హోమ్‌: కాంతిని కూడా తనలో లయం చేసుకోగల అపారశక్తి కేంద్రం కృష్ణబిలంపై మన అవగాహనను మరింత పెంచిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్‌ అవార్డు దక్కింది. అవార్డు కింద అందే నగదు బహుమతిలో సగం బ్రిటిష్‌ శాస్త్రవేత్త రోజర్‌ పెన్‌రోజ్‌కు దక్కనుండగా మిగిలిన సగం మొత్తాన్ని జర్మనీకి చెందిన రైన్‌హార్డ్‌ గెంజెల్, అమెరికన్‌ శాస్త్రవేత్త ఆండ్రియా గేజ్‌లు చెరిసగం పంచుకుంటారని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ మంగళవారం ప్రకటించింది. కృష్ణబిలం ఏర్పడటం ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతానికి ప్రబల ఉదాహరణ అని గుర్తించినందుకు పెన్‌రోజ్‌కు అవార్డు లభించగా మన పాలపుంత మధ్యలో అతి భారయుతమైన, తక్కువ ప్రాంతాన్ని ఆక్రమించిన ఖగోళ వస్తువును గుర్తించి నందుకుగాను రైన్‌హార్డ్‌ గెంజెల్, ఆండ్రియా గేజ్‌లకు అవార్డు అందిస్తున్న ట్లు అకాడమీ సెక్రటరీ జనరల్‌ గోరన్‌ కే హాన్సన్‌ వివరించారు. ఒకప్పుడు కేవలం కాల్పినిక కథలకు మాత్రమే పరిమితమైన కృష్ణ బిలాలు వాస్తవిక ప్రపంచంలోనూ భాగమని ఈ పరిశోధనలు స్పష్టంగా తెలియజేశాయని, కాలం కూడా నిలిచిపో యే విస్మయకర కృష్ణబిలాల ఉనికిని ఈ అవార్డు గుర్తిస్తోందని అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది.

బ్రిటన్‌ శాస్త్రవేత్త రోజర్‌ పెన్‌రోజ్‌ గణిత శాస్త్రం ఆధారంగా కృష్ణ బిలాలు ఏర్పడే అవకాశాలను రూఢి చేశారు. గెంజెల్, గేజ్‌లు ఇరువురు మన పాలపుంత మధ్యభాగంలో దుమ్ముతో కూడిన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ పలు నక్షత్రాలు తిరుగుతు న్నప్పటికీ వర్ణించేందుకు వీలుకాని సంఘటనలు ఏవో చోటు చేసుకుంటున్నట్లు తెలుసుకున్నారు. తదుపరి పరిశోధనల ద్వారా ఆ ప్రాంతం ఓ భారీ కృష్ణబిలమని మన సూర్యుడికి 40 లక్షలరెట్లు ఎక్కువ∙బరువు ఉందని గెంజెల్, గేజ్‌ల పరిశోధనలలో తెలిసింది. ఒకే రంగంలో పరిశోధనలు చేసిన వారు నోబెల్‌ అవార్డును పంచుకోవడం కొత్తేమీ కాదు. గత ఏడాది కెనడా దేశస్తుడైన ఖగోళ శాస్త్రవేత్త జేమ్స్‌ పీబల్స్‌ మహా విస్ఫోటం తర్వాతి సూక్ష్మకాలపు పరిణామాలను వివరించినందుకు నోబెల్‌దక్కగా సౌర కుటుంబానికి ఆవల ఉన్న గ్రహాలను గుర్తించినందుకు స్విట్జర్లాండ్‌ శాస్త్రవేత్తలు మైకేల్‌ మేయర్, క్యూలోజ్‌లకు అవార్డు అందించారు. 

కృష్ణబిలం అంటే..

  • విశాల విశ్వంలో అక్కడక్కడ ఉండే అదృశ్య ప్రాంతాలు. కంటికి కనిపించవు సరికదా.. చుట్టూఉన్న ఖగోళ వస్తువులన్నింటినీ తమలోకి ఆకర్షించుకుంటూ ఉంటాయి. ఇవి ఎంతటి శక్తిమంతమైనవి అంటే... విశ్వం లోనే అత్యంత వేగంగా ప్రయాణించగల కాంతిని కూడా తమలో కలిపేసుకోగలవు.
  • సూర్యుడి లాంటి భారీ నక్షత్రాలు తమలోని ఇంధనం మొత్తాన్ని ఖర్చు పెట్టేసిన తరువాత తమలో తాము కుప్పకూలిపోతూ కృష్ణబిలాలుగా మారతాయని అంచనా.
  • పాలపుంతలతోపాటే కృష్ణబిలాలు కూడా ఏర్పడతాయని శాస్త్రవేత్తల అంచనా.
  • కృష్ణబిలాల్లోకి ప్రవేశించిన పదార్థం ఏమవు తుందో ఎవరికీ తెలియదు. ఐన్‌స్టీన్‌ తరువాత అంతటి వాడుగా ప్రఖ్యాతి పొందిన శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ అంచనా ప్రకారం... కృష్ణబిలాల్లోకి ప్రవేశించిన పదార్థం అన్ని వైపుల నుంచి లాగబడుతుంది. దీన్నే హాకింగ్‌ స్పాగెటిఫికేషన్‌ అని పిలిచారు. కృష్ణ బిలానికి ఆవల ఏముందో కూడా ఎవరికీ తెలియదు.
  • 1960లో జాన్‌ ఆర్చీబాల్డ్‌ వీలర్‌ కృష్ణ బిలాలకు ఆ పేరు పెట్టారు.
  • ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించిన తొట్టతొలి కృష్ణబిలం పేరు సైగ్నస్‌ ఎక్స్‌–1.
  • సూర్యుడు.. ఇంధనమంతా ఖర్చయిపోయి కుప్పకూలిపోయినా కృష్ణబిలంగా మారేంత పెద్దది కాదు.
  • భూమికి అతిదగ్గరగా ఉన్న కృష్ణబిలం పేరు వీ616 మోనోసెరోటిస్‌. దాదాపు మూడు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇది.
  • విశ్వంలో అతి పెద్ద కృష్ణబిలం ఎన్‌జీసీ 4889. నిద్రాణంగా ఉన్న ఈ కృష్ణబిలం ఎప్పుడు చైతన్యవంతమై చుట్టూ ఉన్న దుమ్ము ధూళి, కాంతులను లయం చేసుకుంటుందో ఎవరికీ తెలియదు. 
  • సౌర కుటుంబం ఉన్న పాలపుంత మధ్యలో ఉన్న అతి భారీ కృష్ణబిలం పేరు ‘సాగిటరియస్‌ –ఏ’. 40 లక్షల సూర్యుళ్లు ఒక్కదగ్గర చేరితే ఉండేంత బరువు ఉంటుంది ఇది. భూమికి 27 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 
>
మరిన్ని వార్తలు