వాతావరణంపై పరిశోధనలకు పట్టం

6 Oct, 2021 04:38 IST|Sakshi

ముగ్గురు శాస్త్రవేత్తలకు ఫిజిక్స్‌ నోబెల్‌ 

స్యూకోరో మనాబే, క్లాస్‌ హాసెల్‌మాన్, జియోర్గియో పరిసీలకు అవార్డు 

స్టాక్‌హోమ్‌: వాతావరణం వంటి అత్యంత సంక్లిష్టమైన విషయాన్ని అర్థం చేసుకునేందుకు దోహదపడే పరిశోధనలు చేసినందుకు ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్‌ అవార్డును స్యూకోరో మనాబే (90), క్లాస్‌ హాసెల్‌మాన్‌ (89), జియోర్గియో పరిసీ (73) అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించింది. మానవ చర్యలు భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకునేందకు పునాదులేసినందుకు స్యూకోరో మనాబే, క్లాస్‌ హాసెల్‌మాన్‌లకు అవార్డులో సగభాగం నగదు బహుమతి లభించగా.. సంక్లిష్ట వ్యవస్థల్లోనూ ఒక పద్దతిని కనుక్కునేందుకు సహకరించిన జియోర్గియో పరిసికు మిగిలిన సగం నగదు దక్కనుంది.  

భూ వాతావరణం సంక్లిష్టమైందనడంలో ఎలాంటి సందేహమూ అవసరం లేదు. ఎక్కడో దక్షిణ అమెరికా తీరప్రాంతంలోని సముద్ర ఉపరితల జలాలు కొంచెం వేడెక్కితే దాని ప్రభావం ఎల్‌నినో రూపంలో భారత్‌లో వ్యక్తమవుతుంది. రుతుపవనాలు బలహీనపడి వర్షాభావ పరిస్థితులు ఏర్పడతుంటాయి. సముద్రాల్లోని జల ప్రవాహాలు మొదలుకొని వాణిజ్య వాయువులు, కొండలు, గుట్టలు, ఉష్ణోగ్రతల్లో తేడాలు, జీవజాతులు, అటవీ విస్తీర్ణంలో మార్పులు ఇలా.. వందలాది అంశాల ఆధారంగా పనిచేసే వాతావరణాన్ని అర్థం చేసుకునేందుకు ప్రిన్స్‌టన్‌ యూనివర్శిటీకి చెందిన స్యూకోరో మనాబే 1960లలోనే ప్రయోగాలు చేశారు.

వాతావరణంలో కార్బన్‌ డైయాక్సైడ్‌ ఎక్కువైతే భూ ఉపరితల ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతాయో మనాబే పరిశోధనల ద్వారా తెలిసింది. మనాబే సొంతంగా భూ వాతావరణానికి సంబంధించిన భౌతిక నమూనాలను సిద్ధం చేసి.. అందులో రేడియో ధార్మికత సమతౌల్యం, గాలి నిట్టనిలువుగా పైకి ఎలా వెళుతుంది? వంటి అంశాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. వీటి ఫలితంగా ప్రస్తుతం వాతవరణాన్ని అంచనా వేసేందుకు అవసరమైన క్లైమెట్‌ మోడల్స్‌ సిద్ధమయ్యాయి.  మనాబే పరిశోధనలు ఒకవైపున ఉంటే...పదేళ్ల తరువాత జర్మనీలోని మ్యాక్స్‌ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మీటిరియాలజీకి చెందిన క్లాస్‌ హాసెల్‌మాన్‌ స్థానిక వాతావరణం, ప్రపంచం మొత్తమ్మీది వాతావరణాలకు మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఓ మోడల్‌ను తయారు చేశారు.

తద్వారా స్థానిక వాతావరణంలో ఎంత గందరగోళంగా ఉన్నా ప్రపంచ వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో క్లైమెట్‌ మోడల్స్‌ ఎలా నమ్మదగ్గవో క్లాస్‌ హాసెల్‌మాన్‌ మోడల్‌ ద్వారా స్పష్టమైంది. ఈ పద్ధతుల వల్ల వాతావరణంలోకి కార్బన్‌డైయాక్సైడ్‌ ఎక్కువగా చేరడం వంటి మానవ చర్యల వల్ల భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతోందని (భూతాపోన్నతి) రుజువు చేయడం వీలైంది. గణితం, జీవశాస్త్రం, నాడీ శాస్త్రం, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి అనేక సంక్లిష్ట వ్యవస్థలను అర్థం చేసుకునేందుకు పరిసీ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి. వీటిల్లో చాలా అంశాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఒక పద్ధతిని అనుసరించకుండా వ్యవహరిస్తున్నట్లు కనిపించినా.. అంతర్గతంలో వాటిల్లోనూ ఒక క్రమపద్ధతి ఉంటుందని గుర్తించారు జియోర్గియో పరిసీ. 

వాతావరణ మార్పులపై తక్షణ చర్యలు అవసరం: పరిసీ 
భూ వాతావరణంలో కార్బన్‌డైయాక్సైడ్‌ వంటి విషవాయువుల మోతాదు పెరిగిపోవడం వల్ల వస్తున్న వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు మానవాళి వేగంగా.. గట్టి సంకల్పంతో తక్షణం చర్యలు చేపట్టాలని ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్‌ అవార్డులు అందుకున్న వారిలో ఒకరైన జియోర్గియో పరిసీ  వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తరాల కోసం ఇప్పుడు చర్యలు చేపట్టాల్సిందేనని ఆయన అవార్డు ప్రకటించిన తరువాత మాట్లాడుతూ స్పష్టం చేశారు.

అంతకుముందు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో నోబెల్‌ అవార్డు కమిటీ ప్రతినిధి గోరాన్‌ హాన్సన్‌... క్లాస్‌ హాసెల్‌మాన్, స్యూకోరో మనాబేలతోపాటు జియోర్గియో పరిసీలు ముగ్గురికి ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్‌ అవార్డు అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా హాన్సన్‌ మాట్లాడుతూ ‘‘ఈ ఏడాది గుర్తించిన ఆవిష్కరణలు వాతావరణానికి సంబంధించిన మన విజ్ఞానం గట్టి శాస్త్రీయ పునాదులపై ఏర్పడిందన్న విషయం స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది అవార్డు గ్రహీతలందరూ సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలను మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు సాయపడ్డవారే’ అని వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు