అంత‍్యక్రియలు చేస్తుండగా కళ్లు తెరిచిన చిన్నారి.. ఆసుపత్రికి తరలించగా..!

25 Aug, 2022 13:56 IST|Sakshi

మెక్సికో సిటీ: చనిపోయిన వ్యక్తులు మళ్లీ ప్రాణంతో తిరిగిరావటం సినిమాల్లో చూసే ఉంటాం. అయితే.. నిజ జీవితంలో అలా జరగటం దాదాపుగా అసాధ్యం. కానీ, డాక్టర్లు చనిపోయిందని ప్రకటించిన ఓ మూడేళ్ల పాప అంత్యక్రియలు చేస్తుండగా లేచింది. నేను బతికే ఉన్నాను అంటూ కళ్లు తెరిచింది. ఈ అరుదైన సంఘటన ఆగస్టు 17న మెక్సికోలో జరిగింది. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యంతో తన పాపను చనిపోయిందని ప్రకటించారని ఆరోపించారు తల్లి మారీ జాన్‌ మెండోజా.  

ఏం జరిగింది?
విల్లా డీ రమోస్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు కమిలా రోక్సానా అనే మహిళ. ఆమె 3 ఏళ్ల కూతురు కమిలా రోక్సానా మార్టినెజ్ మెన్డోజా.. కడుపు నొప్పి, వాంతులు, జ్వరంతో బాధపడుతుండగా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, మరో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారు. అప్పటిలోపు పారాసిటమల్‌ ట్యాబ్లెట్స్‌ వేయాలని ప్రిస్క్రిప్షన్‌ ఇచ్చారు. మరో డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లేలోపు పాప ఆరోగ్యం మరింత విషమించింది. అక్కడి వైద్యులు మందులు ఇచ్చి, చిన్నారికి పండ్లు, వాటర్ ఇవ్వాలని సూచించారు. అయినప్పటికీ ఆమె పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో ఎమర్జెన్సీ రూమ్‌కు తరలించి చికిత్స అందించారు.  

ఆసుపత్రి సిబ్బంది పాపకు ఎక్కువ సమయం ఆక్సిజన్‌ పెట్టి ఉంచారని తల్లి ఆరోపించారు. 10 నిమిషాల పాటు ఇంట్రావీనస్‌ ద్రవాలను ఎక్కించిన తర్వాత వాటిని తొలగించి చనిపోయినట్లు వెల్లడించారని తెలిపారు. డీహైడ్రేషన్‌ కారణంగా చనిపోయిందని వైద్యులు పేర్కొననారు. ఆ తర్వాతి రోజు అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో చిన్నారిని ఉంచిన శవ పేటికలో ఓ గాజు ముక్క గాలిలో తెలుతుండటాన్ని గమనించింది ఆమె తల్లి. పక్కవారికి చెప్పగా వారు కొట్టిపారేశారు. ఆ తర్వాత కమిలా కళ్లు కదిలించినట్లు ఆమె బామ్మ గమనించింది. వెంటనే తెరిచి చూడగా నాడి కొట్టుకుంటుంది. హుటాహుటిన అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ కొద్ది సేపటికే పాప మరణించింది. పాప చనిపోయిందని నిర్లక్ష్యంతో ప్రకటించిన డాక్టర్లపై బాధితురాలి తల్లి మెండోజా కేసు నమోదు చేశారు. వైద్యులపై తనకు ఎలాంటి పగ లేదని, అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉంటాయన్నారు.

ఇదీ చదవండి: ప్యాంటులో దాచి 60 పాములు, బల్లుల స్మగ్లింగ్‌.. అధికారులే షాక్‌!

మరిన్ని వార్తలు