300 కోట్ల ప్రాణులు కనుమరుగు!

29 Jul, 2020 02:22 IST|Sakshi

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ప్రభావం

డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ నివేదిక వెల్లడి

మెల్‌బోర్న్‌: దాదాపు 300 కోట్ల వన్య ప్రాణులు మరణాలు/వలసలకు ఆస్ట్రేలియాలో చెలరేగిన భీకర కార్చిచ్చు కారణమని తాజా నివేదికలో వెల్లడించింది. యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ వేల్స్, యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ కసెల్, చార్లెస్‌ స్టర్ట్‌ యూనివర్సిటీ, బర్డ్‌ లైఫ్‌ ఆస్ట్రేలియాలు కలసి వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌)లు సంయుక్తంగా 11.46 మిలియన్ల హెక్టార్ల పరిధిలోని కార్చిచ్చుతో ధ్వంసమైన అటవీ ప్రాంతం, జనావాసాలపై పరిశోధన నిర్వహించి నివేదికను వెల్లడించాయి.

గతంలో 120 కోట్ల వన్య ప్రాణులు చనిపోయినట్లు ఆ నివేదికలో వెల్లడించాయి. అయితే ఆ పరిశోధన పూర్తి స్థాయిలో జరగలేదని, కార్చిచ్చు వ్యాపించిన చోటంతా నిర్వహించిన తాజా పరిశోధనలో దానికి మూడు రెట్ల సంఖ్యలో వన్య ప్రాణులు మరణించినట్లు వేరే ప్రాంతానికి వెళ్లినట్లు వెల్లడైందని పరిశోధకులు చెప్పారు. 143 మిలియన్ల పాలిచ్చే జంతువులు, 246 కోట్ల పాకే జంతువులు, 180 మిలియన్ల పక్షులు, 5.1 కోట్ల కప్పలు మరణించినట్లు డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ చెప్పింది. ఆధునిక ప్రపంచంలో ఈ స్థాయిలో నష్టం కలిగిన ఘటన కనీవినీ ఎరుగనిదని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ తెలిపింది.  ఎగసిన మంటల నుంచి వన్యప్రాణులు తప్పించుకునే అవకాశం లేదని, తప్పించుకున్నా ఆహారం లేక మరణించి ఉంటాయని, వేరే చోట మనుగడ సాగించలేక కూడా మరణించి ఉండవచ్చని పేర్కొంది.

మరిన్ని వార్తలు