అక్కడ 36 వేల మందికి ప్రాణాపాయం!

6 Oct, 2020 14:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 61 ఏళ్ల క్రిస్‌ డర్కన్‌ మార్చి 23వ తేదీన ఆస్పత్రికెళ్లి ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయించుకోగా ఆయనకు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది. బిర్మింగమ్‌లో భార్య అలిసాన్‌తో కలిసి నివసిస్తోన్న డర్కన్‌కు వంశ పారంపర్యంగా ప్రాస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చినట్లు తేలింది. ఆయన తాత, తండ్రులతోపాటు టామ్‌ అనే 46 ఏళ్ల తమ్ముడికి కూడా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చిందట. ఆయన తమ్ముడు ఏడాది క్రితమే ఆపరేషన్‌ చేయించుకొని ప్రాణాపాయం నుంచి బయట పడ్డారట. అలాంటి అదష్టం తనకు లేనందుకు క్రిస్‌ డర్కన్‌ ప్రస్తుతం కుమిలిపోయారు.

డర్కన్‌కు  ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ఉందని తేలిన మరుసటి రోజు నుంచే లండన్‌లో లాక్‌డౌన్‌ అమలు చేశారు. ఆయనకు హైగ్రేడ్‌ క్యాన్సర్‌ ఉండే అవకాశం ఉన్నందున బయాప్సీ నిర్వహించాలంటూ ఆస్పత్రి నుంచి ఓ లేఖ వచ్చిందట. ఆయన ఆగమేఘాల మీద ఆస్పత్రికి వెళ్లగా బయాప్సీ నిర్వహించేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయట. లాక్‌డౌన్‌ కారణంగా ఆస్పత్రి అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని వైద్య సేవలను నిలిపి వేశారని చెప్పారట. ఆ తర్వాత ఆయన ఏ ఆస్పత్రికి వెళ్లి ఇలాంటి సమాధానాలే వినాల్సి వచ్చింది.

ఆ తర్వాత డర్కన్‌ జూన్‌ 9వ తేదీన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బయాప్సీ చేయించుకున్నారు. క్యాన్సర్‌ ప్రమాదకర స్థాయిలో ఉందని తేలడంతో ఆయనకు ఆగస్టు నెలలో ‘ర్యాడికల్‌ ప్రొస్టేటెక్టమీ’ చేసి ఆ గ్రంధిని తొలగించారు. దాదాపు ఐదు నెలలపాటు శస్త్ర చికిత్స జరిగే వరకు బతుకుతానో, లేదోననే భయాందోళనల మధ్య ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లు ఆయన చెప్పారు. లండన్‌లో ఆయన లాగా భయాందోళనలకు గురవుతున్న వారు ఏడు వేల నుంచి 36 వేల వరకు ఉన్నట్లు క్యాన్సర్‌ రిసెర్చ్‌ హబ్‌ ‘డాటా–కెన్‌’ వెల్లడించింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రాబల్యం ఇంకా తగ్గక పోవడంతో క్యాన్సర్‌ సహా అత్యవసరంకానీ ఆపరేషన్లన్నీ ఇప్పటికీ నిలిచిపోయాయి.

మరిన్ని వార్తలు