ఆ వ్యక్తికి ఏకకాలంలో మంకీపాక్స్‌, కరోనా, హెచ్‌ఐవీ... నమోదైన తొలి కేసు

25 Aug, 2022 14:04 IST|Sakshi

ఇటలీలోని ఒక వ్యక్తి ఒకేసారి మంకీపాక్స్‌, కరోనా, హెచ్‌ఐవి ఎటాక్‌ అయ్యాయని వైద్యులు వెల్లడించారు. ఆ వ్యక్తి  ఐదు రోజుల స్పెయిన్‌ పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి గత తొమ్మిది రోజులుగా తీవ్ర జ్వరం, తల, గొంతు నొప్పులతో  బాధపడ్డాడని చెప్పారు. అంతేగాక అతని ప్రైవేట్‌ భాగాలలో తీవ్ర ఇన్ఫెక్షన్‌లతో బాధపడ్డాడని వివరించారు.

అదీగాక అతని చర్మం పై దద్దుర్లు, పెద్ద పెద్ద గాయాలు వంటివి కూడా వచ్చాయని చెప్పారు. దీంతో అతన్ని ఆస్పత్రి వర్గాలు అత్యవసర ఇన్ఫెక్షన్‌ విభాగానికి తరలించి చికిత్స అందించడం ప్రారంభంచారు. తొలుత అతనికి మంకీపాక్స్‌, కరోనా, హెచ్‌ఐవీ టెస్టులు చేయగా రిపోర్టుల్లో పాజిటివ్‌ అని తేలిందని చెప్పారు.

ఇలా ఒకేసారి మూడు వ్యాధులు ఎటాక్‌ అయ్యిన తొలికేసు ఇదేనని వైద్యులు చెబుతున్నారు. అతనికి కరోనాకి సంబంధించి ఓమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ కూడా సోకిందని తేలింది. దీంతో అతనికి కోవిడ్‌ సంబంధించిన వ్యాక్సిన్‌లు ఇచ్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోవిడ్‌, మంకీపాక్స్‌ నుంచి బయటపడి కోలుకున్నాడని చెప్పారు. కానీ ఆ వ్యక్తి ఎయిడ్స్‌కి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ కేసు మంకీపాక్స్‌, కరోనా ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తెలియజేసిందన్నారు. అలాగే ఒక వ్యక్తి లైంగిక అలవాట్లు వ్యాధుల నిర్ధారణ చేయడానికి ఎంత కీలకమో ధృవీకరించిందన్నారు. పైగా ఆయా రోగులకు చికిత్స అందించేటప్పుడూ వైద్యులు కూడా తగిన జాగ్రత్తల తీసుకోవాలని పరిశోధకులు  సూచించారు.

(చదవండి: మూకుమ్మడిగా కుక్కల దాడి... పోస్టల్‌ ఉద్యోగి మృతి)

మరిన్ని వార్తలు