పైసా ఖర్చు కావద్దని 30 కిలోల పళ్లు తిన్నారు!

27 Jan, 2021 20:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చైనా: చైనాకు చెందిన వాంగ్‌ తన ముగ్గురి స్నేహితులతో కలిసి విమానయానానికి సిద్ధమయ్యాడు. అయితే వారి దగ్గర మరీ ఎక్కువ లగేజ్‌ ఉంది. ఎయిర్‌పోర్టు నిబంధనల ప్రకారం పరిమిత లగేజీ కంటే ఎక్కువ బరువు ఉంటే దానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అక్కడి సిబ్బంది వీరి దగ్గర ఉన్న సామాను బరువు రీత్యా 300 యుయాన్లు అంటే భారత కరెన్సీ లెక్కలో రూ.3,384 కట్టమన్నారు. అంత డబ్బు చెల్లించాలా? అని నోరెళ్లబెట్టిన ప్రయాణికులు వెంటనే ఓ ఉపాయం ఆలోచించారు. డబ్బులు కట్టడానికి బదులు బరువు తగ్గించుకుంటే సరిపోతుందని భావించారు. (చదవండి: జలపాతంలో బికినీ షూట్‌: ఇవే తగ్గించుకుంటే మంచిది!)

వెంటనే బ్యాగులు తెరిచి అందులో ఉన్న ముప్పై కిలోల నారింజ పళ్లన్నీ నలుగురూ తినడం మొదలు పెట్టారు. కేవలం 20-30 నిమిషాల్లోనే పళ్లన్నింటినీ హాంఫట్‌ అనిపించారు. కానీ జేబు ఖాళీ అవలేదు అన్న సంతోషం వారికి ఎక్కువ సేపు నిలవలేదు. ఒకేసారి ఎక్కువ మోతాదులో నారింజ ఫలాలను తినడంతో వారి నోటిలో పూత ఏర్పడి మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనా యున్నాన్‌ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. వాళ్ల కక్కుర్తిని కొందరు తిట్టిపోస్తుంటే మరికొందరు మాత్రం 'అబ్బా, ఏం చేస్తిరి? ఏం చేస్తిరి?', 'ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందయ్యో!' అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: రుచి చూసే ఉద్యోగం.. గంటకు రూ.1700)

మరిన్ని వార్తలు