చనిపోయిన కూతురిపై ప్రేమతో 25 ఏళ్లుగా గోళ్లు పెంచుతున్న మహిళ.. గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో చోటు

5 Aug, 2022 12:18 IST|Sakshi

ఎవరైనా గోర్లు ఎంత పెంచుకుంటారు? ఇంచు.. మహా అయితే రెండు ఇంచులు. కానీ, డయానా ఆర్మ్‌స్ట్రాంగ్‌ అనే మహిళ మాత్రం ఫీట్ల కొద్దీపెంచేసింది. ఆమె గోర్లన్నీ కలిపితే.. 42 అడుగుల 10.4అంగుళాలు పొడవు. అంటే.. నాలుగంతస్తుల భవనం కంటే ఎక్కువేనన్నమాట. అందుకే అత్యంత పొడవైన చేతివేళ్ల గోళ్లు కలిగిన మహిళగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఆమె గోర్లలో అతి పొడవైనది 4 అడుగుల 6.7అంగుళాలు ఉండగా, అతి చిన్నది 3 అడుగుల 7 అంగుళాల పొడవుతో ఉంది.

అయితే డయానా గోళ్లు పెంచడం వెనుక ఓ విషాద గాథ ఉంది. డయానా కూతురు ఆస్తమాతో చనిపోయింది. చనిపోవడానికి ముందు రోజంతా తల్లితోనే గడిపిన ఆ అమ్మాయి.. రాత్రిపూట తల్లి గోళ్లు తీసి, పాలిష్‌ చేసింది. తల్లీకూతుళ్లు ఆ రాత్రంతా ముచ్చట్లతోనే గడిపేశారు. తెల్లారి ఆ అమ్మాయి చనిపోయింది. కూతురు పాలిష్‌ చేసిన గోళ్లను కట్‌ చేయొద్దనుకుంది డయానా. అంతే... 25 ఏళ్లుగా పెంచుతూనే ఉంది. మిగిలిన పిల్లలు గోళ్లు కట్‌ చేసుకోమని సూచించారు. బయటికి వెళ్లినప్పుడు జనాలు వింతగా చూశారు. అవేమీ పట్టించుకోలేదామె. ఎందుకంటే ఆ గోళ్లను చూసుకున్నప్పుడల్లా తన కూతురు తనతోనే ఉన్నట్లనిపిస్తుందంటుంది. అదే విషయాన్ని పిల్లలతోనూ చెప్పింది.

ఆ తరువాత వాళ్లెప్పుడూ కట్‌ చేసుకోమని చెప్పలేదు. ఇక బయటికి వెళ్లినప్పుడు కొందరు ఆమెతో ఫొటో దిగడానికి ఇష్టపడ్డా.. ఆమె అంగీకరించలేదు. ఇప్పుడు, గిన్నిస్‌ రికార్డు తరువాత ఫొటోస్‌కు ఓకే చెబుతానంటోంది. వేర్లలా పెరిగిన గోళ్లతోనే ఆమె అన్ని పనులూ చక్కబె డుతుంది. ల్యాప్‌టాప్‌ను సైతం ఆపరేట్‌ చేస్తుంది. ఒక్క వంటమాత్రమే చేయలేనని చెబుతోంది. లక్ష డాలర్లు ఇస్తామని చెప్పినా తాను గోళ్లు మాత్రం కట్‌ చేయనంటోంది.
చదవండి: మంకీపాక్స్‌తో వణికిపోతున్న అమెరికా.. హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటన

మరిన్ని వార్తలు