కీలక సమాచారాన్ని వెల్లడించిన రష్యా న్యూస్‌ ఏజన్సీ  

11 Feb, 2021 18:57 IST|Sakshi

మాస్కో: భారత్‌, చైనా దేశాల మధ్య తూర్పు లద్ధాక్‌లోని గల్వాన్‌ లోయలో గతేడాది జరిగిన ఘర్షణలో చైనాకే ఎక్కువ ప్రాణ నష్టం వాటిల్లిందని రష్యా న్యూస్‌ ఏజన్సీ టీఏఎస్‌ఎస్‌ సంచలన విషయాలను వెల్లడించింది. ఆ ఘర్షణలో చైనాకు చెందిన 45 మంది సైనికులు మరణించినట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది. 2020 జూన్‌ 15న ఎల్‌ఏసీ వద్ద భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ దుస్సాహసం చేయగా, 16వ బీహార్ బెటాలియన్‌కు చెందిన కమాండింగ్ అధికారి కల్నల్‌ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత సైనికులు చైనా దళాలకు ధీటుగా జవాబిచ్చారు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులయనట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. 

అయితే చైనా మాత్రం వారికి జరిగిన ప్రాణనష్టంపై ప్రకటన విడుదల చేసేందుకు నిరాకరించింది. ఈ ఘటనలో చైనాకు చెందిన 40 మందికిపైగా సైనికులు మరణించి ఉంటారని విదేశీ మీడియా కథనాలు వెలువరించినప్పటికీ, చైనా మాత్రం ఈ విషయంలో నోరు మెదపలేదు. కాగా, ఈ ఘర్షణ అనంతరం భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు పోటాపోటిగా సైనిక దళాలను సరిహద్దుల్లో మోహరించాయి. సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సైనిక, దౌత్య చర్చలు పలు దశల్లో కొనసాగాయి. ఘర్షణ జరిగిన పది నెలల అనంతరం బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఇరు దేశాల మధ్య స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం బుధవారం అధికారికంగా వెల్లడించగా, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం పార్లమెంట్‌లో ప్రస్తావించారు. 

మరిన్ని వార్తలు