ఐస్‌క్రీమ్‌ బాక్సుల్లో కరోనా

17 Jan, 2021 05:34 IST|Sakshi

చైనా యంత్రాంగం అప్రమత్తం

4,800 బాక్సుల్లో వైరస్‌ జాడ గుర్తింపు

బీజింగ్‌: కరోనా వైరస్‌ జాడలున్న 4,800 ఐస్‌క్రీం బాక్సులను చైనా అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమై ఈ వైరస్‌ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందరికి వ్యాపించింది? అనే విషయాలపై ఆరా తీసే పనిలో పడ్డారు. ఈ ఘటన చైనా ఈశాన్య ప్రాంతంలోని టియాన్జియాన్‌ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. స్థానిక టియాన్జిన్‌ డకియావోడావో ఫుడ్‌ కంపెనీలో తయారైన ఐస్‌క్రీం శాంపిళ్లను పరీక్షించగా కరోనా వైరస్‌ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో బట్వాడా కాని 2,089 ఐస్‌క్రీం బాక్సులను కంపెనీ స్టోర్‌ రూంలోనే సీల్‌ వేసి ఉంచారు.

మిగతా, 1,812 ఐస్‌క్రీం బాక్సులు వివిధ ప్రావిన్సులకు, 935 బాక్సులు స్థానిక మార్కెట్‌కు పంపిణీ కాగా అందులో 65 మాత్రం అమ్ముడు పోయినట్లు తేలింది. సరఫరా అయిన ప్రాంతాల్లో విచారణ చేపట్టి, వాటి ద్వారా ఎవరికైనా వైరస్‌ సోకిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. దీంతోపాటు ఆ ఐస్‌క్రీం ఫ్యాక్టరీలోని 1,662 మంది ఉద్యోగులను సెల్ఫ్‌ ఐసొలేషన్‌లో ఉండాలని ఆదేశించారు. ఆ కంపెనీ ఐస్‌క్రీం తయారీలో వాడిన పాలపదార్థాలు ఉక్రెయిన్, న్యూజిల్యాండ్‌ నుంచి వచ్చినట్లు గుర్తించిన ఆరోగ్య శాఖ అధికారులు..అవి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాక్సుల్లో వైరస్‌ ఘటనపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని యూకేలోని లీడ్స్‌ యూనివర్సిటీ వైరాలజిస్టు గ్రిఫ్ఫిన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు