Covid Fourth Wave: ఫ్రాన్స్‌లో కఠిన ఆంక్షలు..

22 Jul, 2021 14:04 IST|Sakshi

పారిస్‌: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక దేశాలు కొవిడ్‌ సెకండ్‌వేవ్‌, థర్డ్‌వేవ్‌ల బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే.. వైరస్‌ ఉధృతిమాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. తాజాగా, ఫ్రాన్స్‌లో వైరస్‌ నాలుగవ దశ ప్రారంభమైందని ఆదేశ ప్రభుత్వ ప్రతినిధి గాబ్రియేల్‌ అ‍‍ట్టల్‌ ప్రకటించారు. ఈ మహమ్మారి మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, మరోసారి తమ దేశంలో కఠినమైన ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించారు.

ఫ్రాన్స్‌లో సాంస్కృతిక వేదికలు, ఉద్యానవనాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌ సందర్శించాలనుకునే వారు తప్పకుండా కోవిడ్‌ టీకా వేసుకున్నట్లు ధృవీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు. అదే విధంగా, కరోనా నెగెటివ్‌ రిపోర్టు కూడా నివేదించాలని అ‍‍ట్టల్‌ పేర్కొన్నారు. టీకాలను ప్రజలందరు వేసుకోవాలని సూచించారు. కోవిడ్‌ నిబంధలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ఆగస్టు ఆరంభం నుంచి, రెస్టారెంట్లు, బార్లలో ప్రవేశించడానికి, రైళ్లలో ప్రయాణించడానికి హెల్త్‌పాస్‌ ను తప్పినిసరిచేస్తున్నట్లు తెలిపారు. టీకా వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి మాత్రమే హెల్త్‌పాస్‌ను జారీచేస్తారని ప్రధాని జీన్‌ కాస్టెక్స్‌ తెలిపారు.

ఈ సందర్భంగా, టీకావేగాన్ని పెంచాలని.. రెండు వారాల్లో ఐదు మిలియన్ల వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంచనున్నామని అధికారులకు ఆదేశించారు. అదే విధంగా, హెల్త్‌పాస్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానతోపాటు జైలు శిక్షను కూడా విధిస్తామని జీన్‌ కాస్టెక్స్‌ హెచ్చరించారు. ఫ్రాన్స్‌లో మంగళవారానికి గాను 18,000  కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.  

మరిన్ని వార్తలు