ఒకదానికొకటి వంద కార్లు ఢీ

12 Feb, 2021 04:04 IST|Sakshi

ఒకటిన్నర మైళ్ల మేర దెబ్బతిన్న వాహన శ్రేణి

ఐదుగురు మృతి

టెక్సాస్‌లో ఘటన

టెక్సాస్‌: ఒకటీరెండూ కాదు..ఏకంగా 100 వాహనాలు.. ఒకదానినొకటి ఢీకొని మైలున్నర మేర చిందరవందరగా పడిపోయాయి. దీంతో మైళ్ల కొద్దీ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన మంచు తుపానుతో రహదారిపై వాహనాల టైర్లు పట్టు కోల్పోయి కనీవినీ ఎరగని రీతిలో ఈ ప్రమాదానికి దారితీసింది.

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం ఫోర్త్‌విత్‌ సమీపంలో 35వ అంతర్రాష్ట్రీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది ఒక్కో వాహనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అందులోని వారిని బయటకు తీసి, అవసరమైన చికిత్స అందిస్తున్నారు. దెబ్బతిన్న వాహనాలను పక్కకు తరలిస్తున్నారు.

చాలా వరకు వాహనాలు నుజ్జునుజ్జయి పోయాయి. జారుడుగా ఉన్న ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు సహాయక సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుందని యంత్రాంగం తెలిపింది. ఫెడ్‌ఎక్స్‌కు చెందిన ట్రక్కు ఒకటి అదుపుతప్పి బారియర్‌ను ఢీకొని ఆగిపోయింది.

వెనుకే వచ్చిన మరికొన్ని కార్లు ఆ ట్రక్కును ఢీకొని నిలిచిపోవడంతో ఈ ప్రమాదాల పరంపర మొదలైనట్లు భావిస్తున్నారు. టెక్సాస్‌ రాష్ట్రంలో షిర్లీ మంచు తుపాను కారణంగా∙జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. తుపాను ప్రభావంతో కెంటకీ, వెస్ట్‌ వర్జీనియాల్లోని సుమారు 1.25 లక్షల నివాసాలు, వాణిజ్యప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు