50 మిలియన్ల మందికి పైగా ప్రజలు బానిసత్వంలోనే: యూఎస్‌ రిపోర్ట్‌

12 Sep, 2022 14:25 IST|Sakshi

జెనీవా: ప్రపంచంలో 50 మిలియన్ల మంది ప్రజలు బలవంతపు పనిలో లేదా బలవంతపు వివాహంలో చిక్కుకున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇటీవలకాలంలో ఆ సంఖ్య మరింత గణనీయంగా పెరిగినట్లు యూఎన్‌  తెలిపింది. యూఎన్‌ 2030 నాటికి అన్నిరకాల ఆధునిక బానిసత్వాన్ని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐతే అనుహ్యంగా 2016 నుంచి 2020 మధ్యకాలంలో సుమారు 10 మిలియన్ల మంది బలవంతపు కార్మికులుగా లేదా బలవంతపు వివాహాల్లో చిక్కుకున్నారని యూఎన్‌ నివేదికలో పేర్కొంది.

వాక్ ఫ్రీ ఫౌండేషన్‌తో పాటు యూఎన్‌ లేబర్ అండ్ మైగ్రేషన్ ఏజెన్సీల అధ్యయనం ప్రకారం గతేడాది చివరి నాటికి సుమారు 28 మిలియన్ల మంది ప్రజలు బలవంతపు పనిలోకి నెట్టివేయబడ్డారని, దాదాపు 22 మిలియన్ల మంది బలవంతంగా వివాహం చేసుకున్నారని తెలిపింది. దీనిని బట్టి ప్రపంచంలో ప్రతి 150 మందిలో దాదాపు ఒకరు ఆధునిక బానిసత్వంలో చిక్కుకున్నారని అధ్యయనం వెల్లడించింది. ఆధునిక బానిసత్వం మెరుగవకపోవడం దిగ్బ్రాంతికరం అని ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌(ఐఎల్‌ఓ) అధిపతి గైరైడర్‌ అని తెలిపారు.

అదీగాక కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితులను మరింత దిగజార్చింది. దీంతో చాలామంది కార్మికుల రుణాలను పెంచిందని అధ్యయనం గుర్తించింది. అంతేగాక వాతావరణ మార్పు, సాయుధ పోరాటాల ప్రభావాల కారణంగా ఉపాధి, విద్యకు అంతరాయం తోపాటు  తీవ్రమైన పేదరికం తలెత్తి అసురక్షిత వలసలకు దారితీసిందని తెలిపింది. దీన్ని దీర్ఘకాలిక సమస్యగా యూఎన్‌ నివేదిక అభివర్ణించింది.

పిల్లల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు బలవంతపు శ్రమలోకి నెట్టబడటమే కాకుండా వారిలో సగానికి పైగా వాణిజ్యపరమైన లైంగిక దోపిడికి గురవుతున్నారని నివేదిక పేర్కొంది. అలాగే వలస కార్మకులు, వయోజన కార్మికులు బలవంతపు పనిలో ఉండే అవకాశం మూడురెట్లు ఉందని పేర్కొంది. ఈ నివేదిక అన్ని వలసలు సురక్షితంగా, క్రమబద్ధంగా ఉండేలా చూసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది అని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) అధిపతి ఆంటోనియో విటోరినో ఒక ప్రకటనలో తెలిపారు.

(చదవండి: శిక్షణ విన్యాసాల్లో అపశ్రుతి.... హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మృతి)
 

మరిన్ని వార్తలు