40 ఏళ్ల తర్వాత కంటిచూపు.. అవుంటేనే చూడగలడు!

25 May, 2021 15:07 IST|Sakshi
కంటి అద్దాల సహాయంతో చూస్తున్న వ్యక్తి

లండన్‌ : కొత్త పుంతలు తొక్కుతున్న సైన్స్‌ పరిజ్ఞానంతో అసాధ్యం అనుకున్న ఎన్నో విషయాలు సుసాధ్యాలుగా మారాయి. మారుతూనే ఉన్నాయి. మనిషి ధీర్ఘకాలిక శారీరక లోపాలకు సైతం సైన్స్‌ చక్కటి పరిష్కారాలను అందిస్తోంది. సైన్సు పుణ్యమా అని తాజాగా ఓ 58 ఏళ్ల వ్యక్తి  40 ఏళ్ల తర్వాత లోకాన్ని చూడగలుగుతున్నాడు. వివరాలు.. ఇంగ్లాండ్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి దాదాపు నలభై ఏళ్లుగా ‘రెటినిటిస్‌ పిగ్మంటోస’ అనే కంటి సంబంధ వ్యాధితో బాధ పడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా కంటి వెనకాల ఉండే రెటీనా దెబ్బతినటంతో రెండు కళ్లూ కనిపించటం లేదు. కొద్దిరోజుల క్రితం పరిశోధకులు అతడికి ‘జెనరిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ లైట్‌ యాక్టివేటెడ్‌ థెరపీ’ నిర్వహించారు. దీంతో కొన్ని నెలల వైద్యం తర్వాత ఓ కన్ను పాక్షికంగా కనిపించటం మొదలైంది. ఇప్పుడు ‘లైట్‌ స్టిములేటింగ్‌’ కంటి అద్దాల సహాయంతో వస్తువులను చూస్తున్నాడు.. వాటిని ముట్టుకోగలుగుతున్నాడు. అతడికి కంటి చూపు రప్పించటానికి పరిశోధకుల బృందం తీవ్రంగా శ్రమించింది.

‘ఆప్తోజెనిటిక్స్‌’ అనే పక్రియను వారు ఉపయోగించారు. జెన్యుపరంగా రెటీనాలోని కణాల్లో మార్పులు చేసి, లైట్‌ సెన్సిటివ్‌ ప్రొటీన్స్‌ను ఉత్పత్తి చేశారు. ఈ ప్రయోగం ఫలితాన్నిచ్చి ఓ కంటిలో మార్పు చోటుచేసుకుంది. అనంతరం, ఓ ప్రత్యేకమైన కంటి అద్దాలను తయారుచేశారు. ఈ అద్దాలు అన్నింటినీ ఫొటో తీసి రెటీనాకు చేరవేస్తాయి. దీంతో ఆ వస్తువులు కనపడతాయి. జన్యుపరంగా మార్పులు చేయబడిన కణాలు మామూలు స్థితికి రావటానికి సదరు వ్యక్తికి కొన్ని నెలల పాటు శిక్షణ ఇచ్చారు. కొన్ని నెలల శిక్షణ తర్వాత పాజిటివ్‌ ఫలితాలు వచ్చాయి.

చదవండి : ఒక్కసారిగా మీదకు దూకిన శివంగి.. పరుగులు తీసిన జనం

మరిన్ని వార్తలు