ఏకంగా 87 పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి... మరొసారి మాజీ భార్యతో ....

2 Nov, 2022 15:13 IST|Sakshi

పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి అంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిళ్లు నిలబడటం అత్యంత కష్టంగా ఉంది. అలాంటి స్థితుల్లో ఇక్కడొక వ్యక్తి  ఒకటి రెండు కాదు ఏకంగా 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు.

వివరాల్లోకెళ్తే...ఇండోనేషియాలోని వెస్ట్‌ జావాలోని మజలెంగ్కాకు చెందిన 61 ఏళ్ల ఖాన్‌ అనే వృద్ధుడు 88వ పెళ్లికి సద్ధమవుతున్నాడు. అది కూడా తన మాజీ భార్యనే వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఆయన సుమారు 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఖాన్‌ ఇలా చాలా సార్లు పెళ్లిళ్లు చేసుకున్నందు వల్ల ఆయన్ని ప్లేబాయ్‌ కింగ్‌ అని పిలుస్తుంటారు. ఆయన ఒక సామాన్య రైతు.

అతను 14 ఏళ్ల వయసులో  తొలిసారిగా వివాహం చేసుకున్నాడు. ఐతే ఖాన్‌ మొదటి భార్య అతని కంటే రెండేళ్లు పెద్దదని, తన పేదరికం గురించి చెప్పకపోవడంతో కేవలం రెండేళ్లలోనే విడాకులు తీసుకుని వెళ్లిపోయిందని చెబుతున్నాడు. ఈ సంఘటన తర్వాత తనకు చాలా కోపం వచ్చిందని అప్పుడే చాలా మంది మహిళలు తనతో ప్రేమలో పడేలా చేసుకునే తెలివతేటలు సంపాదించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తాను మహిళలకు ఇబ్బంది కలిగించేవి, చేయనని, వారి భావోద్వేగాలతో కూడా ఆడుకోననని అందువల్లే చాలా మంది తన ప్రేమలో పడ్డారని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం తాను పెళ్లి చేసుకోబుతున్న తన మాజీ భార్య తన నుంచి విడిపోయి చాలా కాలం అయ్యిందని అయినప్పటికీ తనను ఇంకా ప్రేమిస్తూనే ఉందని చెబుతున్నాడు. అలాగే తన కోసం తిరిగి వచ్చే తన మాజీ ప్రేయసులను తిరస్కరించలేనని చెప్పాడు. ఐతే  87 పెళ్లళ్లు చేసుకున్న​ ఖాన్‌ తనకు ఎంతమంది పిల్లలున్నారనే దాని గురించి మాత్రం వెల్లడించలేదు. 

(చదవండి: మాకు సరైన నాయకుడే లేడంటూ 100 ఏళ్ల వ్యక్తి పార్లమెంట్‌ బరిలోకి)

మరిన్ని వార్తలు