Mexico Earthquake: భారీ భూకంపం, పరుగులు తీసిన జనం, టూరిస్టులు

8 Sep, 2021 10:24 IST|Sakshi

వరుస ప్రకంపనలతో వణికిన  మెక్సికో నగరం

భూకంప తీవ్రతకు కదిలిపోయిన భవనాలు

భయంతో పరుగులు తీసిన జనం

మెక్సికోలో  మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూమి కంపించినట్టు  నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. భూకంప కేంద్రం గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్ట్‌కి ఆగ్నేయంగా 11 కిలోమీటర్లు (ఏడు మైళ్లు) దూరంలో కేందద్రీకృతమై ఉన్నట్టు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలను పలువురు సోషల్‌ మీడియాలో షేర్‌  చేయడంతో  వైరల్ అవుతున్నాయి.

ప్రధానంగా రాజధాని నగరంలో భారీ భూకంపంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు. వరుస ప్రకంపనలతో పర్యాటకులు హోటళ్లను ఖాళీ చేశారు. కంపన తీవ్రతకు వందలాది కిలోమీటర్ల దూరంలో పలు భవనాలు కొన్ని సెకన్ల పాటు కదిలిపోయాయి. ముందుగా నైరుతి మెక్సికోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై జరిగినట్లు ఎలాంటి నివేదికలు లేవని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్‌బామ్ తెలిపారు.  ఒక వ్యక్తి మరణించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్  ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఒక వీడియో సందేశంలో  తెలిపారు.

కొయుకా డి బెనిటెజ్ నగరంలో యుటిలిటీ పోల్  పడి ఒక వ్యక్తి మరణించాడని, గెరెరో రాష్ట్ర గవర్నర్ హెక్టర్ అస్తుడిల్లో మిలెనియో టీవీకి చెప్పారు. అకాపుల్క్‌ మేయర్ అదెలా రోమన్ మాట్లాడుతూ  ప్రజలు ఆందోళన చెందుతున్నారనీ,  చాలా  ప్రాంతాలలో  గ్యాస్ లీకేజీలు వార్తలు వచ్చినట్టు తెలిపారు. 
 


భూకంపం మెక్సికో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో   తీవ్ర ప్రభావం చూపింది.  స్నానం చేస్తుండగా,  చాలా బలమైన కంపనలు రావడంతో  చాలా భయపడిపోయా..  గట్టిగా అరిచాను.. చివరికి బాత్‌ టవల్‌తో మాత్రమే  బయటపడ్డానంటూ  ఒక పర్యాటకుడు తన అనుభవాన్ని పంచుకున్నారు. "నేను మా అమ్మతో వచ్చాను.  హోటల్ 11 వ అంతస్తులో  మేముండగా ఒక్కసారిగా  కంపించింది.  అమ్మ భయపడిపోయింది అంటూ  ఏడుస్తున్న తన 86 ఏళ్ల తల్లిని అక్కున చేర్చుకున్నారు. 

కాగా ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల సరిహద్దులో ఉన్న మెక్సికో ఒకటి. 1985, సెప్టెంబర్ 19 న మెక్సికో నగరంలో 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 10వేల మందికి పైగా  ప్రాణాలు కోల్పోగా,  వందలాది భవనాలను  ధ్వంసమయ్యాయి. మళ్లీ   2017,   సెప్టెంబర్‌లో వచ్చిన 7.1 భూకంపం కారణంగా  370 మంది మరణించారు.

మరిన్ని వార్తలు