రికార్డు సంఖ్యలో ప్రయాణం.. 640 మంది కాదు..823 మంది!

22 Aug, 2021 05:17 IST|Sakshi

రికార్డు సంఖ్యలో జనాన్ని తరలించిన సీ–17

వాషింగ్టన్‌: అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌ నుంచి గత ఆదివారం బయలుదేరిన విమానంలో అంచనా వేసిన దాని కంటే చాలా ఎక్కువ మందే ప్రయాణించినట్లు అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు తెలిపారు. సీ–17 విమానంలో జనం కిక్కిరిసి కూర్చున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ విమానంలో 640 మంది ప్రయాణికులున్నట్లు అప్పట్లో అంచనా వేశారు. కానీ, వాస్తవానికి ఆ రోజు ఆ విమానంలో 183 మంది చిన్నారులు సహా మొత్తం 823 మంది ప్రయాణించినట్లు ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

చిన్నారులంతా పెద్ద వారి భుజాలపైన, వీపుమీద కూర్చుని ఉన్నారని, వారిని ఇప్పటి దాకా లెక్కలోకి తీసుకోలేదని పేర్కొంది. సీ–17లో ఇంతమంది జనం ప్రయాణించడం కొత్త రికార్డని తెలిపింది. గత ఆదివారం కాబూల్‌లోకి తాలిబన్లు అడుగు పెట్టడంతో భీతిల్లిన విదేశీయులు, స్థానికులు అమెరికా వైమానిక దళానికి చెందిన విమానంలో చోటు సంపాదించేందుకు ప్రాణాలకు తెగించారు. ఎలాగైనా సరే, దేశం నుంచి బయటపడాలనే ఆత్రుతలో కొందరు విమానం పైన కూడా ఎక్కి కూర్చున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు