ఒకే సారి రెండు కరోనా వేరియంట్లు.. వృద్ధురాలు బలి!

11 Jul, 2021 19:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బ్రుసెల్స్‌ : ఒకేసారి రెండు కరోనా వైరస్‌ వేరియంట్ల బారిన పడిన ఓ వృద్దురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బెల్జియంలో వెలుగుచూసింది. సదరు వృద్దురాలి శరీరంలో యూకే, సౌత్‌ ఆఫ్రికన్‌ వేరియంట్లను గుర్తించినట్లు బెల్జియం సైంటిస్టులు ప్రకటించారు. బ్రుసెల్స్‌కు చెందిన 90 ఏళ్ల వృద్దురాలు గత మార్చినెలలో కరోనా వైరస్‌ బారినపడింది. దీంతో ఆమెను అలాస్ట్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె శరీరంలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ సరిగానే ఉన్నా.. ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఐదు రోజుల తర్వాత మృత్యువాత పడింది. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించగా.. ఆమె శరీరంలో బ్రిటన్‌ ఆల్ఫా వేరియంట్‌, సౌత్‌ ఆఫ్రికా బెటా వేరియంట్లు రెండూ ఉన్నట్లు గుర్తించారు. కరోనా రోగి శరీరంలో రెండు వేరియంట్లను గుర్తించటం ఇదే మొదటిసారని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తుంటాయని తెలిపారు.

దీనిపై మాలుక్యులర్‌ బయాలజిస్ట్‌ ఆనీ వాన్‌కీన్‌బెర్హన్‌ మాట్లాడుతూ.. ‘‘ మార్చి నెలలో ఈ రెండు వేరియంట్లకు సంబంధించిన కేసులు బెల్జియంలో బాగా నమోదయ్యాయి. ఆమె ఇద్దరు వేరు వేరు వ్యక్తుల నుంచి ఈ రెండు వేరియంట్లను అంటించుకుని ఉంటుంది. అయితే, ఆమెకు ఎలా ఈ వైరస్‌లు సోకాయన్న సంగతి తెలియలేదు. ఆమె ఆరోగ్యం త్వరగా క్షీణించటానికి ఈ రెండు వేరియంట్లే కారణమని చెప్పటం చాలా కష్టం’’ అని తెలిపింది. కాగా, బెల్జియంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా 1,027 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 1,093,700 కేసులు రికార్డయ్యాయి.. 25,198మంది మరణించారు.

మరిన్ని వార్తలు