మాకు సరైన నాయకుడే లేడంటూ 100 ఏళ్ల వ్యక్తి పార్లమెంట్‌ బరిలోకి

1 Nov, 2022 17:58 IST|Sakshi

పార్లమెంటరీ ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు నేపాల్‌లోని గుర్ఖా ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు టికా దత్‌ పోఖారెల్‌. వయసు 100 ఏళ్లు. నేడు(సోమవారం) వందవ ఒడిలోకి అడుగుపెట్టాడు.  దేశ రాజకీయాలపై విసుగుచెంది తాను కూడా పోటీ సిద్ధమయ్యాడు.  అది కూడా నేపాల్‌ మాజీ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండపై పోటీ చేసి గెలిచి, హిమలయ దేశాన్ని మళ్లీ హిందూ దేశంగా మార్చాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నట్లు పోఖారెల్‌ తెలిపారు.  ఇక్కడ చట్టం, న్యాయం లేదని, కేవలం డబ్బు సంపాదించుకోవడం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారని పోఖారెల్‌ ఆరోపించారు.  సరైన నాయకుడే నేపాల్‌లో లేడని, అందుకే తాను పోటీకి సిద్ధమైనట్లు తెలిపారు.

అంతేగాదు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, బాగా నడవడం, మాట్లాడటమే గాకుండా రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉంటారని నేపాలీ కాంగ్రెస్‌(బీపీ) అధ్యక్షుడు సుశీల్‌ మాన్‌ సెర్చన్‌ తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా ఆయన పేరును అభ్యర్థిగా నమోదు చేసింది. నవంబరు 20న జరగనున్న నేపాల్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పెద్ద అభ్యర్థి ఆయనే. అంతేకాదు నేపాల్‌లో ఫెడరల్‌ పార్లమెంట్‌కి, ప్రావిన్షియల్‌ అసెంబ్లీకి నవంబర్‌ 20న ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో పోఖారెల్‌ మాట్లాడుతూ....ప్రచండను ఓడించి ఎన్నికల్లో గెలుస్తానని పోఖారెల్‌ ధీమాగా చెబుతున్నాడు. గుర్ఖా నేలకు తానెంటో తెలుసునని అన్నారు. ఈ దేశ నాయకులు విధానాలు, సూత్రాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయకుండా దోచుకున్నారని చెప్పారు. తాను ప్రజలకు హక్కులను కల్పించడమే కాకుండా మళ్లీ హిందూ దేశంగా మార్చేందుకే తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశానని వివరించారు. 67 ఏళ్ల ప్రచండకు వ్యతిరేకంగా 11 మంది అభ్యర్థుల తోపాటు గుర్ఖా రెండు నియోజకవర్గాల నుంచి తన అభ్యర్థిత్వాన్ని పోఖారెల్‌ దాఖలు చేసినట్లు సెర్చన్‌ తెలిపారు.

(చదవండి: పుతిన్‌ ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌...71 వేల మంది రష్యా సైనికులు మృతి)

మరిన్ని వార్తలు