మనం ఉపయోగించే మాస్క్‌ మంచిదేనా?

26 Nov, 2020 12:07 IST|Sakshi

సింగపూర్: కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ఉపయోగించే మాస్క్‌ తయారీలో వాడే పదార్థాలు, దాని రూపకల్పన, పొడవు తదితర అంశాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. ‘‘ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్’’ పేరిట ప్రచురితమైన జర్నల్‌లో వైద్య నిపుణులు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఫేస్ మాస్క్‌లు, వాటి ఉపయోగం గురించి చేసిన పరిశోధనల ఆధారంగా.. మాస్క్‌ డిజైన్‌లలో కూడా పలు సమస్యలు ఉన్నాయని, వాటిలో మార్పు చేయగలిగితే సత్ఫలితాలు పొందవచ్చని గ్రహించినట్లు పేర్కొన్నారు. ఫేస్ మాస్క్‌లు వైరస్‌ను ఫిల్టర్ చేయడం, దాన్ని నిరోధించే విధానం గురించి అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఈ బృందంలో భారతీయ సంతతికి చెందిన ఒక శాస్త్రవేత్త కూడా ఉన్నారు.

"వైద్య సిబ్బంది ఉపయోగించే(శస్త్ర చికిత్స సమయంలో) సర్జికల్‌ మాస్కుల వినియోగం సమర్థవంతంగా కరోనా వ్యాప్తిని అరికట్టగలదు. సాధారణ ప్రజలు కూడా వీటిని విరివిగా ఉపయోగించాలి. కనీసం 70 శాతం మంది ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఇటువంటి మాస్క్‌లను ఉపయోగిస్తే మహమ్మారిని నిర్మూలించవచ్చు. అంతేకాదు.. సాధారణ వస్త్రాలతో తయారు చేసిన మాస్కులను తరచుగా ధరించడం ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చు’’ అని సింగపూర్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య నిపుణుడు సంజయ్ కుమార్ అన్నారు. వైరస్‌ లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మినపుడు లేదా దగ్గినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరలు మనపై పడకుండా మాస్కు అడ్డుకుంటుంది. అంతేకాదు గాలిలోని అనేకానేక సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించకుండా ఆపేస్తుంది.

ఇక 5 మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న తుంపరలు ఒక్కోసారి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఏరోసోలైజ్ అయి, ఎక్కువసేపు గాలిలోనే ఉండటం వల్ల వైరస్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం వస్త్రంతో తయారు చేసిన మాస్కులతో పాటు సర్జికల్‌, ఎన్‌95 మాస్కులను ప్రజలు విరివిగా ఉపయోగిస్తన్న విషయం తెలిసిందే. కాగా ఎన్‌95 మాస్కులు మాత్రమే ఏరోసోల్ పరిమాణ బిందువులను ఫిల్టర్ చేయగలవు. హైబ్రిడ్ పాలిమర్ పదార్థాలతో తయారు చేసిన ఫేస్ మాస్క్‌లు అధిక సామర్థ్యంతో కణాలను ఫిల్టర్ చేయగలవని పరిశోధకులు కనుగొన్నారు. ఈ ప్రత్యేక మాస్క్‌లలో ఉపయోగించే ఫైబర్స్ పరారుణ వికిరణానికి పారదర్శకంగా ఉంటాయి. మాస్క్‌ కింద నుంచి వేడి తప్పించి ముఖాన్ని చల్లబరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. "శ్వాస నిరోధకత, ఫేస్ మాస్క్ ప్రవాహ నిరోధకత మధ్య కొంత సంబంధం ఉండవచ్చు. ఇది ఫేస్ మాస్క్ ధరించిన విరామం కోసం అధ్యయనం చేయవలసి ఉంటుంది" అని రచయిత హియో ప్యూహ్ లీ చెప్పారు.

మరిన్ని వార్తలు