కిడ్నాపర్ల చెర నుంచి 42 మంది విడుదల

28 Feb, 2021 08:22 IST|Sakshi

లాగోస్‌: రెండు వారాలక్రితం ఉత్తర నైజీరియాలోని ఒక పాఠశాల నుంచి కిడ్నాప్‌కి గురైన  27 మంది విద్యార్థులు సహా, మొత్తం 42 మందిని, బందిపోట్లు విడుదల చేసినట్టు  ఓ అధికారి వెల్లడించారు. కిడ్నాపర్ల చెరలోనుంచి విడుదలైన వారు దేశ రాజధాని మిన్నాకి  చేరుకున్నారని నైజర్‌ గవర్నర్, చీఫ్‌ ప్రెస్‌ సెక్రటరీ మేరీ నియోల్‌ బెర్జ్‌ వెల్లడించారు. ప్రభుత్వ సైన్స్‌ కాలేజ్‌ కగారా నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులను సాయుధులైన దుండగులు రెండు వారాల క్రితం అపహరించారు.

నార్తరన్‌ నైజీరియాలోని జాంఫరా రాష్ట్రంలోని బోర్డింగ్‌ స్కూల్‌నుంచి 317 మంది బాలికలను అపహరించిన ఒక రోజు తర్వాత ముష్కరులు వీరిని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారని పోలీసులు తెలిపారు. జాంఫరా రాష్ట్రంలో అనేక బందిపోటు ముఠాలు పనిచేస్తున్నాయి. డబ్బు కోసం, లేదా వారి సభ్యులను జైలు నుంచి విడుదల చేయించుకునేందుకు వారు ఈ దారుణాలకు పాల్పడుతుంటారని ప్రభుత్వం తెలిపింది.

లొంగిపోయేది లేదు: బుహారీ
నైజీరియా అధ్యక్షుడు మొహమ్మద్‌ బుహారీ మాట్లాడుతూ కిడ్నాప్‌కి గురైన పాఠశాల పిల్లలను సురక్షితంగా, సజీవంగా విడిపించుకోవడం ప్రభుత్వ ప్రథాన లక్ష్యమని అన్నారు. అయితే అంతమాత్రాన అమాయక పాఠశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకొన్న బందిపోట్ల బ్లాక్‌ మెయిలింగ్‌లకు లొంగిపోయేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం కంటే తాము శక్తివంతులమని బందిపోట్లు, కిడ్నాపర్లు, ఉగ్రవాదులు భ్రమలో ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. నైజీరియాలో అనేక యేళ్ళుగా ఇటువంటి కిడ్నాప్‌లు, దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్‌ 2014లో బోరో రాష్ట్రంలోని చిబోక్‌ మాధ్యమిక పాఠశాల నుంచి 276 మంది బాలికలను జిహాదిస్ట్‌ గ్రూపు కిడ్నాప్‌ చేసింది. ఇప్పటికీ వారిలోని 100 మంది బాలికల ఆచూకీ తెలియరాలేదు.

మరిన్ని వార్తలు