సమావేశాలు విజయవంతమైనట్టే.. ఆ క్రెడిట్ మొత్తం భారత్‌దే

12 Sep, 2023 11:07 IST|Sakshi

వాషింగ్టన్: భారత దేశంలో జరిగిన 18వ జీ20 సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. తొలిసారి నిర్వహించినా భారత్ ఈ సమావేశాలను అద్భుతంగా నిర్వహించిందని సభ్య దేశాలు అభినందిస్తున్నాయి. ఈ సందర్బంగా అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ భారత్ నిర్వహించిన ఈ సమావేశాలు సూపర్ సక్సెస్ అయ్యినట్లు నమ్ముతున్నామన్నారు.

సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ ఛానల్ ప్రతినిధి జీ20 సమావేశాలు విజయవంతమైనట్టేనా అని అడిగిన ప్రశ్నకు మాథ్యూ మిల్లర్ సమాధానమిస్తూ.. భారత్ జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించిందని విశ్వసిస్తున్నానన్నారు. జీ20 అనేది చాలా పెద్ద సంస్థ. రష్యా చైనాలు కూడా ఇందులో భాగస్వాములే. సమావేశాలకు రష్యా  గైర్హాజరు కావడంపై ప్రశ్నించగా రష్యా ఉక్రెయిన్ అంశంపై సభ్యులందరివీ భిన్నకోణాలు అయినప్పటికీ భారత్ సిద్ధం చేసిన డిక్లరేషన్‌లో ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన సూత్రాలను ఉల్లంఘించరాదని వారు రాసిన ఆ మాట రష్యా ఉక్రెయిన్‌పై చేసిన దాడిని సూటిగా స్ఫురించి సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడానికి దోహదపడిందన్నారు. 

అణ్వాయుధాలను చూపించి భయపెట్టడం కానీ వాటిని ప్రయోగించడం కానీ ఆమోదయోగ్యం కాదని యుద్ధాన్ని గురించి వారు ప్రస్తుతించిన విధానం అద్భుతమన్నారు. డ్రాఫ్ట్‌లో ఎక్కడా రష్యా పేరెత్తకుండా ఉక్రెయిన్‌లో సమగ్రమైన, న్యాయమైన, మన్నికైన శాంతిని నెలకొల్పాలని అంతిమంగా అంతర్జాతీయ ఆర్ధిక సహకారం అందించడమే ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశ్యమని వారు చెప్పిన విధానం బాగుందన్నారు. మొత్తంగా డిక్లరేషన్‌పై సభ్యదేశాల ఏకాభిప్రాయం సాధించడమే భారత్ సాధించిన గొప్ప విజయమన్నారు.  

బిల్ గేట్స్ కూడా..  
జీ20 సమావేశాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి భారత్ చూపించిన చొరవ అనిర్వచనీయమన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్  పాత్రపై ఏకాభిప్రాయం సాధించి ప్రాపంచిక సంక్షేమానికి పెద్దపీట వేశారు. సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎక్స్(ట్విటర్)లో రాశారు. 

ఇది కూడా చదవండి: ఆ విషయంలో భారత్‌ను మెచ్చుకోవాల్సిందే.. చైనా 

మరిన్ని వార్తలు