ఇజ్రాయెల్‌కు పూర్తి మద్ధతు: రిషి సునాక్‌

19 Oct, 2023 17:06 IST|Sakshi

టెల్‌ అవివ్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ గురువారం యుద్ధ ప్రభావిత ప్రాంతం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు తాము పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడూ, ఎప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ దేశం పక్షాన నిలబడతామని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టిన రిషి సునాక్‌కు.. ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్‌ ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఇరు దేశాల అగ్రనేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిషి సునాక్‌ మీడియాతో మాట్లాడారు. హమాస్‌లా కాకుండా తమ పౌరులకు ఏ హానీ జరగకుండా ఇజ్రాయెల్‌ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తమకు తెలుసన్నారు. యుద్ధ ప్రాంతం నుంచి బ్రిటిష్ పౌరులను తరలించినందుకు నెతన్యాహుకి  ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్‌ పౌరులే కాక పాలస్తీనియన్లు కూడా హమాస్ బాధితులని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు.

మానవతా సహాయం కోసం సరిహద్దులను తెరిచినందుకు సంతోషంగా ఉందన్నారు. అన్నింటికంటే మించి ఇజ్రాయెల్ ప్రజలకు సంఘీభావాన్ని తెలియజేయడానికి ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. ఇజ్రాయెల్‌ మాటల్లో చెప్పలేని భయంకరమైన తీవ్రవాద చర్యను ఎదుర్కొంటుందని, యునైటెడ్ కింగ్‌డమ్, తాను ఆ దేశానికి అండగా ఉన్నామని భరోసా ఇస్తున్నట్లు తెలిపారు.
చదవండి: పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో ఆందోళనలు

కాగా  పాల‌స్తీనా ఉగ్ర సంస్ధ హ‌మాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్ర‌తిదాడుల‌తో మిడిల్‌ ఈస్ట్‌ అట్టుడుకుతోంది. మరింత ప్రాంతాలకు  వ్యాపించకుండా యుద్ధంవెంటనే ఆపాలని ప్రపంచ నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశమై యుద్ధ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హమాస్‌కు వ్యతిరేకంగా చేస్తోన్న పోరులో ఇజ్రాయెల్‌కు  అమెరికా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ వెంటనే నేడు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ యుద్ధ భూమిలో అడుగుపెట్టారు.

మరిన్ని వార్తలు