Afghan earthquake: జీవచ్ఛవాలు

24 Jun, 2022 04:25 IST|Sakshi
బెర్నాల్‌ జిల్లాలో పూర్తిగా నేలమట్టమైన ఇళ్లు

అఫ్గాన్‌ గ్రామాల్లో హృదయవిదారక దృశ్యాలు

పక్తిక ప్రావిన్స్‌లో ఊళ్లకు ఊళ్లు నేలమట్టం

గయాన్‌ (అఫ్గానిస్తాన్‌): అఫ్గానిస్తాన్‌ను కుదిపేసిన పెను భూకంపం భారీ విధ్వంసాన్ని మిగిల్చింది. ఊళ్లకు ఊళ్లు నేలమట్టమయ్యాయి. వ్యవప్రయాసల కోర్చి  సహాయ చర్యల కోసం వెళ్లిన సిబ్బంది కొండల్లో మృతదేహాలు ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా పడి ఉండటం చూసి కంటతడి పెడుతున్నారు. వాటిని వెలికి తీయడం తప్ప చేయడానికి అక్కడేమీ లేదని సహాయ సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేశారు. బుధవారం నాటి భూకంపంలో వెయ్యి మంది దుర్మరణం పాలవడం తెలిసిందే.

పక్తిక ప్రావిన్స్‌లోని గయాన్, బర్మల్‌ జిల్లాల్లో అత్యధికంగా విధ్వంసం జరిగింది. అక్కడి ఊళ్లన్నీ శిథిలాల దిబ్బలుగా మిగిలాయి. ప్రాణాలతో బయట పడ్డవారు సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. జీవచ్ఛవాలుగా మారారు. అయిన వారి కోసం వారు ఏడుస్తూ వెదుకుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. భారీ వర్షం సహాయ చర్యలకు అడ్డంకిగా మారింది. ఉత్తర వజరిస్తాన్‌ నుంచి అఫ్గాన్‌కు వెళ్లిన 30 మంది పాకిస్తానీలు భూకంపానికి బలైనట్టు ప్రభుత్వం వెల్లడించింది.

చేతులే ఆయుధాలుగా
గ్రామాలన్నీ నేలమట్టం కావడంతో శిథిలాల కింద ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో చూసేందుకు గ్రామస్తులు చేతులనే ఆయుధాలుగా మార్చుకున్నారు. గుట్టలుగా పడున్న రాళ్లు, రప్పలను చేతులతో తొలగిస్తున్నారు. తలదాచుకోవడానికి తమకు కనీసం టెంట్‌ కూడా లేదని వాళ్లు వాపోతున్నారు. పరిసర ఊళ్ల వాళ్లు తప్ప ప్రభుత్వం నుంచి ఎవరూ సాయానికి రావడం లేదని చెబుతున్నారు. తిండికి కూడా లేక వారంతా అల్లాడుతున్నారు. ఎక్కడ చూసినా మరణించిన తమవారి ఆత్మశాంతి కోసం బాధితులు చేస్తున్న ప్రార్థనలే వినిపిస్తున్నాయని కవరేజీకి వెళ్లిన బీబీసీ జర్నలిస్టు చెప్పారు. సహాయ చర్యలకు రంగంలోకి దిగినట్టు యునిసెఫ్‌ చెప్పింది.

మృతుల్లో చిన్నారులే అధికం
భూకంపంలో పిల్లలు, యువతే అత్యధికంగా బలైనట్టు వైద్య సిబ్బంది వెల్లడించారు. రెండు హెలికాఫ్టర్లలో పక్తిక ప్రావిన్స్‌కు వెళ్లిన వైద్యులకు ఎటు చూసినా పిల్లలు, యువత శవాలే కనిపిస్తున్నాయి. భూకంప తీవ్రతకు సెల్‌ టవర్లు కూడా కూలి కమ్యూనికేషన్లు తెగిపోవడంతో సమాచారం తెలుసుకోవడం కూడా కష్టంగా మారింది. ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో కొద్ది రోజులైతే తప్ప తేలేలా లేదు.

మరిన్ని వార్తలు