Panjshir: పంజ్‌షీర్‌ ప్రతిఘటన దళాల దెబ్బ?.. గందరగోళంగా అఫ్గన్‌ ఆధిపత్యపోరు

5 Sep, 2021 09:59 IST|Sakshi

Afghanistan Panjshir Talibans Fight: అఫ్గనిస్తాన్‌లో ఆధిపత్య పోరు ఆసక్తికరంగా మారింది.  అఫ్గన్‌ ప్రతిఘటన దళాలు, తాలిబన్లు చేస్తున్న పరస్పర పైచేయి ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయి. కీలకమైన పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని తాలిబన్లు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈలోపు పంజ్‌షీర్ తిరుగుబాటు దళం ఆ ప్రకటనను ఖండించింది. యుద్ధం కొనసాగుతోందని... పంజ్‌షీర్‌ లొంగిపోలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు పంజ్‌షీర్ ప్రతిఘటన దళం నుంచి మరో ప్రకటన వచ్చింది. హోరాహోరీ పోరులో 600 మంది తాలిబన్లను మట్టుపెట్టినట్లు ప్రకటించుకుంది.
 

పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నాలకు పంజ్‌షీర్ యోధుల నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాము జరిపిన దాడుల్లో ఆరు వందల మంది తాలిబన్లు చనిపోయారని, వెయ్యి మందికి పైగా లొంగిపోయారని పంజ్‌షీర్ తిరుగుబాటు దళ ప్రతినిధి ఫహీం దష్టి ప్రకటించాడు. ఇక తాలిబన్ల దాడులను తిప్పి కొడుతున్నామని పంజ్‌షీర్లు చేస్తున్న ప్రకటనలతో... వాస్తవ పరిస్థితి ఏంటన్న దానిపై అంతర్జాతీయ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. 

మరోవైపు పంజ్‌షీర్‌ దళాల ప్రకటనను తాలిబన్లు ధృవీకరించడం లేదు. పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌పై తాలిబన్ల యుద్ధం కొనసాగుతోందని చెప్పారు. అయితే పంజ్‌షీర్ రాజధాని బజారక్‌కి వెళ్లే రోడ్డు మార్గంలో ల్యాండ్ మైన్లు అమర్చారని, అందువల్లే  అక్కడి నుంచి ముందుకెళ్లడం కష్టంగా మారిందని చెప్పారు. ఇప్పటివరకూ పంజ్‌షీర్‌లోని ఏడు జిల్లాల్లో నాలుగు తాలిబన్ల ఆధీనంలోకి వచ్చాయన్నారు. మిగతా జిల్లాలను కూడా వీలైనంత త్వరగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మధ్య ప్రావిన్స్‌ వైపు నుంచి తాలిబన్లు పోరాడుతున్నారని తాలిబన్ ప్రతినిధి బిలాల్ కరిమీ వెల్లడించారు.  చదవండి: అఫ్గన్‌ ప్రభుత్వ ఏర్పాటు.. రంగంలోకి పాక్‌

ఇరు వర్గాలు ప్రకటనలైతే చేస్తున్నాయి గానీ... ఎక్కడా ఆధారాలు బయటపెట్టట్లేదు. దీంతో ఈ పరస్పర ప్రకటనలు అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇంకోవైపు కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ను తిరిగి ప్రారంభించిన తాలిబన్లు.. మిగతా దేశాల ప్రతినిధులు, రవాణా, సహాయక చర్యల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

క్లిక్‌ చేయండి: తాలిబన్ల అత్యుత్సాహం.. అమాయకులు బలి 

మరిన్ని వార్తలు