అఫ్గాన్‌లో విద్యార్థినుల నిరసన గళం

25 Dec, 2022 05:52 IST|Sakshi

వర్సిటీల్లో ప్రవేశాల నిషేధంపై ఆందోళన

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌లో ఉన్నతవిద్యాసంస్థల్లో మహిళా విద్యార్థులపై నిషేధం విధించి, మహిళా విద్యను ఉక్కుపాదంతో అణిచివేస్తున్న తాలిబన్‌ ప్రభుత్వానికి విద్యార్థినుల నుంచి నిరసనలు మరింత పెరిగాయి. దయలేని తాలిబాన్లను ఎదిరించి వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగిన విశ్వవిద్యాలయాల విద్యార్థినులు తమ గొంతుకను గట్టిగా వినిపిస్తున్నారు. శనివారం హెరాత్‌ నగరంలోని రాష్ట్ర గవర్నర్‌ అధికారిక నివాసం ఎదుట ఆందోళన చేసేందుకు దాదాపు 150 మంది వర్సిటీ విద్యార్థినులు బయల్దేరారు.

‘విద్య మా హక్కు’ అంటూ ప్లకార్డులు, బ్యానర్లను చేతబూనిన వారిని తరిమికొట్టేందుకు తాలిబన్‌ భద్రతా బలగాలు వాటర్‌ కేనన్లు వినియోగించారు. రహదారి వెంట ఉన్న చెట్ల కొమ్మలతో విద్యార్థినులను కొట్టారు. అయినాసరే నిరసనర్యాలీని ముందుకు తీసుకెళ్లేందుకు విద్యార్థినులు ప్రయత్నించారు. సంబంధించిన వీడియోను అసోసియేటెడ్‌ ప్రెస్‌ వార్తాసంస్థ విడుదలచేసింది.

‘తారిఖీ పార్క్‌ నుంచి నిరసన ర్యాలీ మొదలుపెట్టాం. అయితే, నగరంలో ప్రతీ వీధిలో సాయుధ తాలిబన్లు మమ్మల్ని అడ్డుకున్నారు. కొట్టారు. మాపై దాడి దారుణం’ అని మరియం అనే విద్యార్థిని ఆగ్రహంగా మాట్లాడారు. అయితే, ఈ నిరసన ర్యాలీపై రాష్ట్ర గవర్నర్‌ హమీదుల్లా ముతావకిల్‌ భిన్నంగా మాట్లాడారు.

‘ఓ నలుగురైదుగురు అమ్మాయిలు వచ్చి ఏదో ఫిల్మ్‌ షూట్‌ చేసి వెళ్లిపోయారు. వారికి ఎలాంటి అజెండా లేదు’ అని అన్నారు. వర్సిటీల్లో మహిళా విద్యపై నిషేధం విధించడంతో తాలిబాన్‌ పాలనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. సౌదీ అరేబియా, టర్కీ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఖతార్, జీ–7 కూటమి దేశాలు తాలిబన్‌ సర్కార్‌ను తీవ్రంగా తప్పుబట్టాయి. అఫ్గాన్‌ విద్యార్థినులకు మద్దతుగా పాక్‌లోని క్వెట్టా సిటీలో కొందరు అఫ్గాన్‌ శరణార్థి విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు.

ఉద్యోగినులను తీసేయండి
స్వచ్ఛంద సంస్థలకు తాలిబన్ల అల్టిమేటం
మహిళలను చదువులకు దూరం చేసేందుకు కంకణం కట్టుకున్న అఫ్గాన్‌ తాలిబన్‌ పాలకులు తాజాగా మహిళలకు శరాఘాతం వంటి మరో చర్యకు పూనుకున్నారు. అఫ్గానిస్తాన్‌లోని విదేశీ, దేశీయ ప్రభుత్వేతర సంస్థలు మహిళా ఉద్యోగాలను తొలగించాలంటూ ఆదేశాలిచ్చారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయని ఆర్థిక మంత్రి మహ్మద్‌ హనీఫ్‌ పేర్కొన్నారు. వీటిని పాటించని ఎన్జీవోల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు. పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ప్రవేశించరాదనే ఆంక్షలు ఇప్పటికే ఉన్నాయి.

మరిన్ని వార్తలు