తిరిగి రండి.. మీకు పూర్తి రక్షణ కల్పిస్తాం: అఫ్గన్‌ ప్రధాని

9 Sep, 2021 17:57 IST|Sakshi

గత ప్రభుత్వ అధికారులను కోరిన నూతన ప్రధాని ముల్లా మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌ ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాలిబన్లు అఫ్గన్‌ను ఆక్రమించిన నాటి నుంచి ఆ దేశంలో పరిస్థితులు తారుమారయ్యాయి. గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులు ఎవరు విధులకు హాజరవ్వడం లేదు.. చాలా మంది దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ప్రస్తుత అఫ్గన్‌ ప్రధాని ముల్లా మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ ప్రభుత్వ అధికారులకు పూర్తి రక్షణ కల్పిస్తామని.. తిరిగి దేశానికి రావాల్సిందిగా కోరారు. ఈ మేరకు అఖుంద్‌ బుధవారం ఓ ప్రకటన చేశారు. (చదవండి: కొత్త కోణం: అఫ్గాన్‌ సింహాలు తలవంచేనా!)

అఖుంద్‌ మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్‌లో అధికారంలోకి రావడానికి మేం భారీ మూల్యం చెల్లించాం. దేశ పునర్నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదుర్కొబోతున్నాం. ఈ సందర్భంగా నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. దేశం విడిచిపోయిన అధికారులు తిరిగి వచ్చేయండి. మీకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తాం. యుద్ధంలో ధ్వంసమైన అఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో అనేక సవాళ్లను చవి చూడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో మీ అవసరం చాలా ఉంది. మీ రక్షణ బాధ్యత మాదే.. తిరిగి దేశానికి వచ్చేయండి’’ అని పిలుపునిచ్చాడు. (చదవండి: Afghanistan: అఫ్గాన్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వం)

తాజాగా అఫ్గనిస్తాన్‌లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో ఎక్కువగా అంతర్జాతీయ ఉగ్రవాదులు, వారి తలపై రివార్డులు ఉన్న వారు గ్వాంటనామా జైళ్లలో మగ్గి వచ్చిన వారే ఉండటం గమనార్హం. ఈ ప్రభుత్వ ఏర్పాటులో పాక్‌ కీలక పాత్ర పోషించింది. అఫ్గన్‌ కేబినెట్‌ మంత్రులు సెప్టెంబర్‌ 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 9/11 దాడులకు ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో అఫ్గన్‌ కేబినెట్‌ మంత్రులు ఆ రోజే తమ ప్రమాణ స్వీకారానికి ఎన్నుకోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు