Afghanistan: ‘అది కట్టుకథ.. వాళ్లిద్దరే దేశాన్ని నాశనం చేశారు’

23 Aug, 2021 17:44 IST|Sakshi
హష్మత్‌ ఘనీ అహ్మద్‌జై(ఫొటో: ఇండియా టుడే)

దేశంలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి

అందుకే నేను ఇక్కడే ఉన్నాను

నా సోదరుడు ఒకవేళ పారిపోనట్లయితే బతికేవాడు కాదు

అశ్రఫ్‌ ఘనీ సోదరుడు హష్మత్‌ ఘనీ కీలక వ్యాఖ్యలు

Afghanistan Crisis: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల పాలనను తాను అంగీకరిస్తున్నానని ఆ దేశ మాజీ అధ్యక్షుడు అశ్రఫ్‌ ఘనీ సోదరుడు, గ్రాండ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కచిస్‌ చీఫ్‌ హష్మత్‌ ఘనీ అహ్మద్‌జై అన్నారు. దేశంలో రక్తపాతాన్ని నిర్మూలించాలంటే ఇదొక్కటే మార్గమని పేర్కొన్నారు. తాలిబన్లు త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన ఆయన.. అయితే తాను మాత్రం అందులో భాగస్వామిని కాలేనని స్పష్టం చేశారు. కాగా అఫ్గన్‌ను తలిబాన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో అశ్రఫ్‌ ఘనీ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన యూఏఈలో ఉంటున్నట్లు ఆ దేశం ప్రకటించింది. అయితే, అశ్రఫ్‌ ఘనీ సోదరుడు హష్మత్‌ మాత్రం అఫ్గనిస్తాన్‌లో ఉండిపోయారు. 

ఈ నేపథ్యంలో ఆయన ఇండియా టుడేతో మాట్లాడుతూ... అఫ్గన్‌లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో రాజకీయాలను కొత్త పంథాలో నడిపించాలనే ఉద్దేశంతోనే తాను దేశంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఓవైపు.. తాలిబన్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పంజ్‌షీర్‌ నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ నాయకుడు అహ్మద్‌ మసూద్‌, మరోవైపు.. తాలిబన్లతో ఏకకాలంలో చర్చలు జరుపుతున్నానని హష్మత్‌ పేర్కొన్నారు. ఎవరి షరతులు వారికున్నాయని, నాతో చర్చించేందుకు మాత్రం ఇరు వర్గాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

అది మాత్రం ఆమోదయోగ్యం కాదు..
‘‘హక్‌మత్‌యార్‌, కర్జాయిని ప్రభుత్వంలో చేర్చుకోవద్దని తాలిబన్లకు విజ్ఞప్తి చేస్తున్నా. వారిద్దరినీ తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విన్నాను. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దేశాన్ని నాశనం చేసింది వాళ్లే. అందుకే వారిని దూరం పెట్టండి’’ అని హష్మత్‌ ఈ సందర్భంగా మాజీ ప్రధాని గుల్‌బుద్ధీన్‌ హక్‌మత్‌యార్‌, మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయిపై విమర్శలు గుప్పించారు. కాగా 

పాక్‌ సెలబ్రేషన్‌ మూడ్‌లో ఉందేమో గానీ..
అఫ్గన్‌లో ప్రస్తుత పరిస్థితులను చూసి పొరుగు దేశం పాకిస్తాన్‌ సంబరాలు చేసుకుంటోందన్న హష్మత్‌ ఘనీ.. శరణార్థులు పోటెత్తితే వారికి బుద్ధి వస్తుందని విమర్శించారు. ‘‘దాదాపు 7 మిలియన్ల మంది డ్యూరాండ్‌ రేఖను దాటే అవకాశం ఉంది. వారిని అదుపుచేయడం పాకిస్తాన్‌కు అంత తేలికేమీ కాదు. కాబట్టి అఫ్గన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే వాళ్లకు.. వాళ్లైనా కొన్ని సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుంది’’ అని పేర్కొన్నారు.

నా సోదరుడు అందుకే వెళ్లిపోయాడు
‘‘నా సోదరుడు అశ్రఫ్‌ ఘనీ డబ్బుతో పారిపోయాడన్నది పూర్తిగా కట్టుకథ. తను ప్రయాణించిన విమానాన్ని ఉజ్బెకిస్తాన్‌లో సోదా చేశారు. అప్పుడు డబ్బు దొరకలేదు. నిజానికి, నా సోదరుడు దేశం విడిచి వెళ్లకపోయి ఉంటే తనను కచ్చితంగా హత్య చేసేవారు. ఇందుకు కుట్ర కూడా జరిగిందనే సమాచారం ఉంది. యూఏఈ తనకు ఆశ్రయం ఇచ్చింది. అయితే, రాజకీయాల గురించి మాట్లాడకూడదనే షరతు విధించింది. కాబట్టి తనేమీ మాట్లాడటం లేదు’’ అని హష్మత్‌ ఘనీ తన సోదరుడి నిర్ణయాన్ని సమర్థించారు.

చదవండి: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్‌ రాజ్యం.. క్రికెటర్‌తో నిశ్చితార్థం రద్దు: నటి

మరిన్ని వార్తలు