Afg​hanistan Crisis:‍ భారీగా పెరిగిన డ్రైఫ్రూట్స్‌ ధరలు

23 Aug, 2021 13:51 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. చాలామంది పౌష్టికాహారంగా డ్రైఫ్రూట్స్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటికి గిరాకీ పెరిగింది. డ్రైఫ్రూట్స్‌లో బాదం, అంజీర, మనక్క, పిస్తా, ఆలూబుకార, ఖుర్బానీ..వంటివి అఫ్గానిస్తాన్‌ దేశం నుంచే మనకు దిగుమతి అవుతాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. అక్కడ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా వీటి రవాణా నిలిచిందని తద్వారా ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

రూ.50 నుంచి రూ.200 వరకు...
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల రాకతో అక్కడి వారి మాటేమో గానీ, అక్కడి నుంచి మన దేశానికి దిగుమతి అయ్యే డ్రైఫ్రూట్స్‌ ధరలపై మాత్రం ప్రభావం పడిందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. మనకు పెద్దమొత్తంలో డ్రైఫ్రూట్స్‌ అక్కడి నుంచే దిగుమతి అవుతాయి. ముందుగా ఢిల్లీ, ముంబయి, తదితర ప్రాంతాలకు వస్తాయి. అక్కడి నుంచి హైదరాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్‌కు దిగుమతి అవుతుంటాయి. అక్కడి నుంచి జిల్లాకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకువస్తుంటారు.

అఫ్గాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా రవాణా నిలిచిపోయింది. ఫలితంగా ఇక్కడ ధరలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం డ్రై ఫ్రూట్స్‌ ధరలు పక్షం రోజుల క్రితంతో పోల్చితే కిలోకు రూ.50 నుంచి రూ.200 వరకు పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

చదవండి: చక్కెర ఎగుమతులపై తాలిబన్‌ ఎఫెక్ట్‌ ?

మరిన్ని వార్తలు