Taliban: ‘రష్యా, అమెరికాలను ఓడించారు’ సరే.. మరి అసలు సమస్య?!

1 Sep, 2021 07:28 IST|Sakshi
కాబూల్‌ ఎయిర్‌పోర్టు రన్‌వేపై తాలిబన్ల ‘బద్రి’ దళ సభ్యులు

విజయం సాధించాం!

అప్పుడు రష్యాను, ఇప్పుడు యూఎస్‌ను ఓడించాం: తాలిబన్లు

కాబూల్‌: అమెరికా దళాల ఉపసంహరణ పూర్తి కావడంతో విజయం సాధించామంటూ తాలిబన్లు ప్రకటించుకున్నారు. యూఎస్‌ దళాలు వైదొలగగానే కాబూల్‌ విమానాశ్రయంలో తాలిబన్‌ బలగాలు కలదిరిగాయి. అప్పుడు రష్యాను, ఇప్పుడు అమెరికాను ఓడించామంటూ సంబరాలు చేసుకున్నాయి. అనంతరం తాలిబన్‌ నాయకులు కొందరు రన్‌వేపైకి చేరుకున్నారు. తాలిబన్‌ నాయకులకు అంగరక్షకులుగా నిలిచిన బద్రి దళాలు ఫొటో ఫోజులిచ్చాయి. ‘అఫ్గానిస్తాన్‌ అంతిమంగా స్వేచ్ఛను సాధించింది’ అని తాలిబన్‌ నేత హెక్మతుల్లా వాసిక్‌ ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేబినెట్‌ను ప్రకటిస్తామని చెప్పారు.

అందరికీ క్మాభిక్ష పెట్టినందున ప్రజలంతా తమ పనులకు తిరిగి వెళ్లాలని, పరిస్థితులు క్రమంగా సాధారణ స్థాయికి వస్తాయని, అంతవరకు ప్రజలు ఓపిక వహించాలని విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయాన్ని పునఃప్రారంభించడం తాలిబన్లకు ఎదురయ్యే తొలి అతిపెద్ద సవాలు కానుంది. మరోవైపు పూర్తి స్వాతంత్య్రం పొందినందుకుగాను అఫ్గాన్లకు తాలిబన్‌ రాజకీయ ప్రతినిధి షాబుద్దీన్‌ డెలావర్‌ శుభాకాంక్షలు చెప్పారు. బలగాల ఉపసంహరణ అనంతరం అఫ్గాన్‌లో ఇంకా 200మంది అమెరికన్లున్నారు.  


ఎయిర్‌పోర్టులోని విమానం కాక్‌పిట్‌లో కూర్చున్న తాలిబన్‌ సభ్యుడు 

అంతా హడావుడి 
మంగళవారం ఉదయం విమానాశ్రయం పరిసరాల్లో ఎప్పటిలాగానే హడావుడి, ఆందోళన కనిపించాయి. టరి్మనల్స్‌లో లగేజులు, దుస్తులు, పలు డాక్యుమెంట్లు చెల్లాచెదరుగా పడిఉన్నాయి. ఆశావహులు విమానాశ్రయం వైపునకు రాకుండా తాలిబన్లు రోడ్లపై కంచెలతో నిలువరించారు. యూఎస్‌ దళాలు వైదొలిగే క్షణాలు ఆసన్నమయ్యే సమయంలో మరోమారు దాడులు జరగకుండా జాగ్రత్త వహించారు.

ఒక్కసారి యూఎస్‌ దళాలు వెళ్లడం పూర్తవగానే తాలిబన్‌ బలగాలు భారీగా విమానాశ్రయంలోకి వచ్చాయి. ఈ సందర్భంగా బద్రి యూనిట్‌ను ఉద్దేశించి తాలిబన్‌ నేత జబిహుల్లా ప్రసంగించారు. ఇకనుంచి దేశ రక్షణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎయిర్‌పోర్ట్‌ పునఃప్రారంభానికి తమ సాంకేతిక బృందం పనిచేస్తోందని జబిహుల్లా విలేకరులకు చెప్పారు. ఇక తమ దేశం స్వేచ్ఛగా ఉంటుందని, షరియా చట్టం అమలు చేస్తామని తాలిబన్లు చెప్పారు.   

ఆర్థికమే అసలు సమస్య 
అఫ్గాన్లు స్వేచ్ఛ పొందారని తాలిబన్లు ప్రకటించుకుంటున్నా అసలు సమస్య ఇప్పుడే ఎదురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు వస్తున్న అంతర్జాతీయ సాయం ఆగిపోవడం, కీలక నిధులను అమెరికా తొక్కిపెట్టడంతో తాలిబన్లకు పాలన సంక్లిష్టం కానుందంటున్నారు. బ్యాంకుల్లో నిధులన్నీ కస్టమర్లు విత్‌డ్రా చేసుకుంటున్నారు. దేశంలోని ప్రభుత్వోద్యోగులకు జీతాలు అందడం లేదు.  దేశంలో కరువు తాండవిస్తుండడంతో ఆహార నిల్వలు తరిగిపోతున్నాయి. పాలన గాడిన పెట్టేందుకు తాలిబన్లు ఏమి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

చదవండి:  Afghanistan Crisis: మరో యుద్ధం మొదలైంది!

మరిన్ని వార్తలు