Afghanistan: ఆకలితో అల్లాడుతున్న అఫ్గన్‌ చిన్నారులు.. తిండి దొరక్క

25 Oct, 2021 14:43 IST|Sakshi

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి ఆ దేశ ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. మొన్నటి వరకు తాలిబన్ల ఆగడాలను, అకృత్యాలను, హింసలను అఫ్గన్లు భరిస్తూ వస్తున్నారు. తాజాగా అక్కడ ఆక‌లి చావులు కూడా మొదలుకావడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. 

ప‌శ్చిమ కాబూల్‌లో హ‌జారా క‌మ్యూనిటీకి చెందిన 8 మంది చిన్నారులు ఆక‌లికితో చనిపోయారు. ఈ విషయాన్ని అఫ్గనిస్తాన్‌ మాజీ చట్టసభ సభ్యుడు మొహమ్మద్ మొహాఖేక్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్గన్‌ ప్రజలకు తగిన జీవన ప్రమాణాలను సరిపడే విధంగా వారు అందించలేకపోయారని ఆయ‌న విమ‌ర్శించారు. ఆప్గనిస్థాన్‌లోని మైనారిటీ వ‌ర్గాలైన హ‌జారా, షియా క‌మ్యూనిటీల‌కు అంత‌ర్జాతీయ స‌మాజం అండ‌గా నిలువాల‌ని కోరారు.

షియా ఇస్లాంను ఆచరించే హజారా ప్రజలు అఫ్గనిస్తాన్ జనాభాలో 9 శాతం ఉన్నారు. హక్కుల సంఘాల నివేదికల ప్రకారం, వారు గతంలో తాలిబాన్లచే తీవ్రంగా హింసించబడ్డారు. ఆగష్టు మధ్యలో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి దేశంలో జీవన పరిస్థితులు క్షీణించడంపై అనేక అంతర్జాతీయ సమూహాలు అప్రమత్తం చేస్తునే ఉన్నాయి.

చదవండి: మరో డ్రామాకు తెరతీసిన చైనా.. కొత్తగా సరిహద్దు చట్టం

మరిన్ని వార్తలు