Afghanistan: ‘వాళ్ల కోసమే వెయిటింగ్‌.. వచ్చి నన్ను చంపేస్తారు’

17 Aug, 2021 17:33 IST|Sakshi

అఫ్గనిస్తాన్‌ మహిళా మేయర్‌ జరీఫా వ్యాఖ్యలు

Taliban Control Over Afghanistan: ‘‘నేను ఇక్కడే.. నా ఇంట్లో కూర్చుని వారి రాక కోసం ఎదురుచూస్తున్నాను. నాకు గానీ, నా కుటుంబ సభ్యులకు గానీ సహాయం చేసేందుకు ఎవరూ లేరు. అయినా, సరే.. నేను నా భర్తతో కలిసి ఇక్కడే కూర్చున్నా. నాలాంటి వాళ్లను చంపడం వారికి ఇష్టం కదా. వాళ్లు ఇక్కడికి తప్పకుండా వస్తారు. నన్ను చంపేస్తారు’’... అఫ్గనిస్తాన్‌ తాలిబన్ల వశమైందన్న ప్రకటన వెలువడగానే.. ఆ దేశంలో అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా మేయర్‌ జరీఫా ఘఫారీ స్పందన ఇది. తాలిబన్ల బలం ముందు నిలవలేక సైన్యం చేతులెత్తేసిన వేళ.. అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ, ఆయన బృందం దేశం విడిచి పారిపోయిన తరుణంలో 27 ఏళ్ల జరీఫా మొండి ధైర్యం ప్రదర్శించారు.

చచ్చినా, బతికినా ఇక్కడే..
‘‘నా దేశం విడిచి నేను ఎక్కడికి వెళ్లాలి.. అసలెందుకు వెళ్లాలి.. బతికినా, చచ్చినా ఇక్కడే ’’ అంటూ మహిళా శక్తిని చాటారు. మూడేళ్ల క్రితం మైదాన్‌ వర్దక్‌ ప్రావిన్స్‌ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా జరీఫా గుర్తింపు పొందారు. ఒక స్త్రీ ఈ విధంగా రాజకీయ చైతన్యం పొందడం సహజంగానే తాలిబన్లకు కంటగింపుగా మారింది. చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు. మూడుసార్లు హత్యాయత్నం చేశారు కూడా. కానీ విఫలమయ్యారు. దీంతో.. ఎలాగైనా జరీఫా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో.. గతేడాది నవంబరులో ఆమె తండ్రి, జనరల్‌ అబ్దుల్‌ వసీ ఘఫారీని కాల్చి చంపేశారు. 

అయినా.. సరే ఆమె వెనకడుగు వేయలేదు. తాలిబన్ల దురాక్రమణలు కొనసాగుతున్న వేళ గాయపడ్డ సైనికులు, సాధారణ పౌరులను కాపాడే ప్రయత్నం చేశారు. త్వరలోనే అఫ్గాన్‌లకు తాలిబన్ల నుంచి విముక్తి లభిస్తుందని, దేశానికి, ఆడపిల్లలకు గొప్ప భవిష్యత్తు ఉంటుందని గట్టిగా విశ్వసించారు. కానీ.. అలా జరగలేదు. తాలిబన్లు ఆదివారం అఫ్గనిస్తాన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారన్న వార్త వినగానే ఆమె కలలు కల్లలయ్యాయి. అందుకే.. రాజకీయ నాయకురాలినై, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తనను కచ్చితంగా చంపేస్తారని జరీఫా వ్యాఖ్యానించారు.  

ప్రత్యక్ష నరకం తప్పదంటూ ఆందోళనలు!
తాలిబన్‌ రాజ్యం వస్తే మహిళలకు ప్రత్యక్ష నరకం తప్పదంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. గతంలో స్త్రీల పట్ల తాలిబన్లు వ్యవహరించిన తీరు.. ‘‘పదిహేనేళ్లు దాటిన ఆడపిల్లలు, 45 ఏళ్ల లోపు వయస్సు గల వితంతువుల జాబితా ఇవ్వండి. వారిని తాలిబన్‌ యోధులకు ఇచ్చి పెళ్లి చేస్తాం’’.. అఫ్గనిస్తాన్‌లోని ఇమామ్‌లు, ముల్లాలకు తాలిబన్‌ గ్రూపు సాంస్కృతిక కమిషన్‌ పేరిట ఇటీవల వచ్చిన నోట్‌ ఈ భయాందోళనలను రెట్టింపు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు వారాల క్రితం అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జరీఫా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.


అఫ్గన్‌ మహిళ ఆవేదన

హక్కుల కోసం పోరాడతారు..
‘‘దేశ పరిస్థితులు, చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి నవతరానికి అవగాహన ఉంది. సోషల్‌ మీడియాలో వారు తమ అభిప్రాయాలు పంచుకోగలుగుతున్నారు. ఒకరితో ఒకరు కమ్యూనికేట్‌ చేసుకోగలుగుతున్నారు. అభ్యుదయ భావజాలంతో తమ హక్కుల కోసం వారు కచ్చితంగా పోరాడతారనే నమ్మకం నాకు ఉంది. నా దేశం భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని విశ్వసిస్తున్నా’’ అని జరీఫా పేర్కొన్నారు. అయితే, నెల కూడా తిరక్కుండానే కాబూల్‌ తాలిబన్ల హస్తగతం కావడంతో.. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఏమవుతుందోనన్న ఆందోళన ఆమెను వెంటాడుతోంది. 

నిజంగా తాలిబన్లు మాట నిలబెట్టుకుంటారా?!
దేశం పూర్తిగా తమ గుప్పిట్లోకి వచ్చిన తర్వాత.. ప్రజలు ఆందోళనతో విదేశాలకు పారిపోతున్న వేళ.. ‘‘ప్రజలపై మేం ప్రతీకార చర్యలకు దిగబోము’’ అని తాలిబన్లు ప్రకటించారు. అంతేకాదు.. మహిళలను బానిసలుగా మార్చాలనుకోవడం లేదని, వారికి కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.


మలాలా యూసఫ్‌జాయ్‌

అయితే, జరీఫాతో పాటు గతంలో ఆమె వలె బెదిరింపులు ఎదుర్కొన్న చాలా మంది మహిళలు ఈ విషయాన్ని పూర్తిగా నమ్మడం లేదు. స్త్రీ విద్యను వ్యతిరేకించి, మలాలా వంటి అనేక మంది ఆడపిల్లలను ఇబ్బంది పెట్టిన తాలిబన్ల పాలనలో తమకు స్వేచ్ఛ దొరకడం కష్టమేనంటూ సామాజిక మాధ్యమాల్లో తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. 
-సాక్షి, వెబ్‌డెస్క్‌.

చదవండి: Afghanistan: తాలిబన్ల కీలక ప్రకటన.. అఫ్గాన్‌లకు..
మళ్లీ నరకంలోకా?.. మా వల్ల కాదు

మరిన్ని వార్తలు